ఏపీలో పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపుతున్నాయి. ఏపీలో పరిస్థితులకు, పాలనకు తెలంగాణలో పరిస్థితులు, పాలనకు మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని హరీశ్ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపాయి. ఏపీలో ఓటర్ కార్డులు రద్దు చేసుకొని తెలంగాణకు రావాలంటూ హరీశ్ రావు అన్న మాటలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. హరీశ్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతలు, మంత్రుల వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆంధ్రా మంత్రులు అనవసరంగా తమ జోలికి రావద్దని, తమ గురించి ఎక్కువ మాట్లాడకపోతే వారికే మంచిదని హెచ్చరించారు. మా దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు అంటూ కారుమూరి కామెంట్లపై ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఏముందో వచ్చి చూడాలని కారుమూరికి హరీశ్ రావు సవాల్ విసిరారు. తమ దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయని హరీశ్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించామని, మీ దగ్గర ఏమున్నాయని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలన్నారని, ఇప్పుడేమో అడగరని ఎద్దేవా చేశారు.
హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరని, విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరని చెప్పారు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరని చెప్పారు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మినా ఎవ్వరూ నోరెత్తరని, వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయని ఆరోపించారు.