తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఆంధ్రోళ్ల పేరును అడ్డదిడ్డంగా వాడేసే గులాబీ పార్టీ.. తాజాగా సరికొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ ముఖ్యమంత్రి మేనల్లుడు హరీశ్ రావు సరికొత్త ముచ్చటను చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఉన్న ఏపీ కార్మికులంతా ఆంధ్రాలో ఉన్న తమ ఓట్లను రద్దు చేసుకొని.. తెలంగాణలో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అంతేకాదు.. ఏపీ పాలన బాగుందా? తెలంగాణ పాలన బాగుందా? అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఉద్యమం నాటి నుంచి ఇప్పటివరకు అవసరానికి ఏపీ వాళ్లను ఉద్దేశించి హరీశ్ రావు (మిగిలిన వారిని కాసేపు పక్కన పెట్టేద్దాం) చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఆంధ్రోళ్లు అంటూ అవమానకరంగా మాట్లాడిన మాటలు ఎన్నో. ఈ రోజున ఓట్లు నమోదు చేసుకోవాలని చెబుతున్న హరీశ్.. కరోనా వేళలో ఏపీ నుంచి అంబులెన్సుల్లో వైద్యానికి వచ్చే వేళ.. చెక్ పోస్టులు పెట్టేసి తిరిగి పంపిన దానిపై ఏమంటారు?
ఆ ముచ్చటను కూడా పక్కన పెట్టేద్దాం. ఈ రోజు తెలంగాణలోకార్మికులు ఏపీ ఓట్లను రద్దు చేసుకోవాలని అడుగుతున్నారు. కార్మికుల ఓట్లే రద్దు చేయాలంటే.. తెలంగాణలో ఉన్న ఇతర ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సైతం తమ ఓట్లను ఇక్కడే నమోదు చేయాలన్నదే హరీశ్ మాటకు అర్థమవుతుంది. అలాంటప్పుడు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు తెలంగాణలో ఓట్లుగా నమోదు చేసుకోవాలని అడగటం వరకు బాగానే ఉన్నా.. తన మేనమామకు చెందిన మీడియా సంస్థ.. నమస్తే తెలంగాణ.. టీ న్యూస్.. తెలంగాణ టుడే తదితర సంస్థల్లో ఏపీకి చెందిన ఉద్యోగులు ఎంతమంది? మరి.. వారి సంస్థల్లో ఎంతమేర ఉపాధిని ఇస్తారు? అన్న ప్రశ్నను సంధించాల్సిందేనని చెబుతున్నారు.
ఏపీ ఓటర్లు తమ ఓట్లను రద్దు చేసుకొని తెలంగాణలో ఓట్లుగా నమోదు చేసుకోవాలని అడగటం అంటే.. వారిని ఓట్లు వేయాలని అడగటమే కదా? మరి.. వారి ఓట్లు కావాల్సినప్పుడు.. వారి వారికి ముందు తమ సొంత సంస్థల్లో ఎంతమేర ఉపాధిని ఇస్తారు? ఇస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.మరి.. నమస్తే సంస్థలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు ఎంతమంది అన్న లెక్కను కూడా హరీశ్ చెబితే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.