ఆంధ్రప్రదేశ్ లో పాలన, అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో ఓటర్లుగా నమోదు కావాలని హరీష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ ఈ క్రమంలోనే వైసీపీ మంత్రులకు, హరీష్ రావుకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై హరీష్ రావు సంచలన విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నేపథ్యంలో బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ నేతలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడంపై హరీష్ స్పందించారు.
విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడామని…కానీ, ఏపీలోని అధికారపక్షం, ప్రతిపక్షం నోరు మెదపలేదని హరీష్ అన్నారు. ఈ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని, ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికీ లేనట్టేనని కేంద్రం ప్రకటించడం కేసీఆర్ పోరాటం వల్లేనని, బీఆర్ఎస్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని హరీష్ రావు అన్నారు. విశాఖ ఉక్కును అమ్మడం లేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీష్ అన్నారు. ఇది, కేసీఆర్, టీఆర్ఎస్, ఏపీ ప్రజల, విశాఖ కార్మికుల విజయమని చెప్పారు.