తెలంగాణలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన రాజకీయంగా పెను దుమారం రేపింది. నిర్మలా సీతారామన్ ను కాంగ్రెస్ నేతలు రోడ్డుపై అడ్డుకోవడంతో మొదలైన రచ్చ చివరకు మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ వరకూ వెళ్లింది. వాస్తవాలు బయటపడతాయనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిర్మలా రామన్ విమర్శించారు. అయితే, ఆమె వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు.
దిగజారి మాట్లాడొద్దంటూ నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి హరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిర్మల అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. 2021లోనే ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరిందని గుర్తు చేశారు. ఒకవేళ, ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే తాను తన మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తారా? అని నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు.
అంతకుముందు, కామారెడ్డి జిల్లాలో పర్యటించిన నిర్మలా సీతారామన్ బాన్సువాడ నియోజకవర్గంలోని బిక్నూర్ రేషన్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ పై ఆమె ఫైర్ అయ్యారు. రేషన్ షాపు వద్ద ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై మండిపడ్డారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని ఇస్తోందని… అలాంటప్పుడు ప్రధాని ఫొటోను ఎందుకు ఉంచలేదని మండిపడ్డారు. రేషన్ షాపుల వద్ద మోదీ ఫొటో పెట్టాలని… లేకపోతే తానే వచ్చి పెడతానని హెచ్చరించారు.
ఉచిత రేషన్ బియ్యంలో కేంద్ర, రాష్ట వాటాలు ఎంతో తనకు తెలీదని కలెక్టర్ బదులివ్వడంతో నిర్మల అసహనం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి అయిన మీకు ఈ విషయం తెలియక పోవడం ఏమిటని నిప్పులు చెరిగారు. అరగంట సమయం ఇస్తున్నానని, ఆ వివరాలు తెలుసుకుని చెప్పాలని హుకుం జారీ చేశారు.
Comments 1