సీఎం జగన్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. జగన్ పై చాలా కేసులున్నాయని, జగన్ దోషిగా తేలితే తర్వాత సీఎం ఎవరు? అని హరిరామజోగయ్య రాసిన లేఖ ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపుతోంది. సీబీఐ, ఈడీ సంస్థలు క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ అభియోగాలను జగన్ పై మోపాయని, వాటి నేపథ్యంలో జగన్ 16 నెలలు జైలులో కూడా ఉన్నారని గుర్తు చేశారు.
బెయిల్ పై బయటికి వచ్చిన జగన్ ను కోర్టు దోషిగా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే తర్వాత సీఎం పదవిని రెడ్లు చేపడతారా లేక కాపులు చేపడతారా అని ప్రశ్నించారు. బడుగు బలహీనవర్గాల వైపు జగన్ మొగ్గితే గర్వపడతామని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే బడుగు బలహీన వర్గాల వారిని సీఎం చేస్తామని జగన్ బహిరంగ ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు.
ఏది ఏమైనా జగన్ కేసుల గురించి, తర్వాతి సీఎం ఎవరు అన్నదాని గురించి రాసిన ఈ లేఖ ఇపుడు వైరల్ అయింది. బీజేపీతో జగన్ కు చెడిందని, ఈ క్రమంలోనే జగన్ త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశముందని ప్రచారం జరగుతున్న నేపథ్యంలో జగన్ కు హరిరామజోగయ్య రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.