జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టీడీపీతో బీజేపీ కలిసేలా జనసేన ప్రయత్నిస్తుందని పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ఆసక్తికర రీతిలో స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన ఒక లేఖ విడుదల చేశారు. పవన్ ఇమేజ్ ను బీజేపీ వాడుకొని లాభపడాలని చూస్తోందని, టీడీపీతో జనసేన కలిస్తేనే జనసేనకు లాభమని పెద్దాయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు పరిపాలన దక్షత జనసేనకు కలిసొస్తుందని, బీజేపీ మత రాజకీయాలు జనసేనకు నష్టం కలిగిస్తాయని చెప్పారు. జనసేన, బీజేపీల పొత్తు వల్ల బీజేపీకే ఎక్కువ లాభమని అభిప్రాయపడ్డారు. జగన్ తో బీజేపీ పెద్దలకు సత్సంబంధాలున్నాయని, పార్లమెంటులో జగన్ పార్టీ అవసరం మోడీకి కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని అన్నారు. అందుకే, ఏపీలో పవన్ ఇమేజ్ ను వాడుకొని బీజేపీ బలపడేందుకు చూస్తోందని షాకింగ్ కామెంట్లు చేశారు. పవన్ వల్ల బీజేపీ-జనసేనల ఓటు బ్యాంకు 2 శాతం పెరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో ఓట్ల శాత పెంచుకోవడానికి, వైసీపీ ప్రబుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే ఉన్నాయని జోగయ్య చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణమని తేల్చిచెప్పారు. బీజేపీ, జనసేనల పొత్తు ఫలితం ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తెలుస్తుందని అన్నారు. కానీ, టీడీపీతో పొత్తు జనసేనకు మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే… ఐదేళ్లపాటు చంద్రబాబు సీఎం అంటే కాపులు, జనసైనికులు హర్ట్ అవుతారని చెప్పారు. మరి, పెద్దాయన కామెంట్లపై పవన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.