తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలవడానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. శుక్రవారం రిలీజ్ కావాల్సిన హనుమాన్ చిత్రానికి ముందు రోజు సాయంత్రం నుంచి పెయిడ్ ప్రిమియర్స్ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే మంచి క్రేజ్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ చిన్న సినిమాకు చాలినన్ని థియేటర్లు ఇవ్వకపోవడంపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. 90 కి పైగా సింగిల్ స్క్రీన్లు ఉన్న హైదరాబాదులో ఈ సినిమాకు అందులో కేవలం నాలుగంటే నాలుగు థియేటర్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
రిలీజ్ దగ్గర పడ్డాక అయినా పరిస్థితి మారుతుంది అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారి ఈ సినిమాకు ఉన్న స్క్రీన్లు కూడా తీసివేసే పరిస్థితి రావడం గమనార్హం. థియేటర్ల కేటాయింపు పంచాయితీపై పీటముడి బిగుసుకొని.. ఏషియన్ సినిమాస్ వాళ్ళ పరిధిలోని అన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్ల నుంచి హనుమాన్ చిత్రాన్ని తొలగించడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ తో పాటు ఏషియన్ చైన్ థియేటర్లు వేటిలోనూ హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించడం లేదు. ఏఎంబీలో గురువారం సాయంత్రానికి షెడ్యూల్ అయిన ప్రెస్ షో సైతం క్యాన్సిల్ అయింది.
థియేటర్లకు సంబంధించి నడుస్తున్న పంచాయితీ విషయంలో హనుమాన్ టీంను చర్చలకు పిలిస్తే రాకుండా సింపతి కోసం ట్రై చేస్తున్నారంటూ ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ విమర్శించడం గమనార్హం. కానీ హనుమాన్ టీం వాదన దీనికి భిన్నంగా ఉంది. తమకు ముందు కేటాయించిన స్క్రీన్లను కూడా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి లాగేసుకున్నారని ఆరోపిస్తోంది హనుమాన్ టీం. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా హనుమాన్ చిత్రానికి ఇచ్చిన థియేటర్లను రద్దుచేసి గుంటూరు కారం మూవీకే ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ పంచాయతీ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.