సంక్రాంతి సినిమాల్లో బడ్జెట్, కాస్ట్ అండ్ క్రూ పరంగా చిన్నదిగా అనిపించే సినిమా హనుమాన్ కానీ దీని పట్ల ప్రేక్షకాసక్తి మాత్రం తక్కువగా లేదు. సంక్రాంతి రిలీజ్ అవుతున్న మిగతా పెద్ద సినిమాలను మించి బుక్ మై షో లో ఎక్కువ లైక్స్ సంపాదించడమే అందుకు నిదర్శనం. ఇక ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ తోని సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్.. షోలు పడ్డాక థియేటర్లను హోరెత్తించేసింది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నార్త్ ఇండియాలో కొంచెం కలిసి వస్తే పాణించే స్థాయిలో హనుమాన్ పెద్ద హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సినిమా సక్సెస్ ను ముందే అంచనా వేసిన హనుమాన్ టీం అప్పుడే సీక్వెల్ కు రంగం సిద్ధం చేసేసింది. సినిమా చివర్లో సీక్వెల్ టైటిల్, రిలీజ్ కూడా అనౌన్స్ చేసేశారు. జై హనుమాన్ పేరుతో రాబోతున్న సీక్వెల్ 2025లో ప్రేక్షకులను పలకరించబోతోంది. సినిమా చివర్లో హనుమంతుడి పాత్రకు ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సీక్వెల్ దిశగా ఒక ఇంట్రెస్టింగ్ టిట్ బిట్ లాంటిది ఇచ్చాడు. హనుమంతుడు రాముడికి ఒక మాట ఇచ్చినట్లుగా చూపించి.. ఆ మాట మీదే సీక్వెల్ కథను నడిపించే లాగా హింట్ ఇచ్చాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ అయ్యాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో రెండో భాగంపై క్యూరియాసిటీ పెంచినట్లుగా.. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అనే ప్రశ్న మీదే రెండో భాగానికి బాట వేశాడు ప్రశాంత్. లిమిటెడ్ బడ్జెట్లోనే హనుమాన్ ను అంచనాలకు మించి తీర్చిదిద్దిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ ను ఇంకా భారీగా తీస్తాడు అనడంలో సందేహం లేదు.