తల్లిదండ్రులు సహజంగా తమ పిల్లలు చేసే తప్పుల్ని క్షమిస్తుంటారు. పెద్ద తప్పులు చేసినా కన్నపేగు ప్రేమతో వారికి అంతో ఇంతో సాయంగా నిలుస్తుంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతంలో అదే తల్లిదండ్రులు సైతం తమ కూతురికి ఉరి వేయటమే సరి అంటూ తేల్చి చెప్పటమే కాదు.. తమ అల్లుడ్ని అన్యాయంగా పొట్టన పెట్టుకుందన్న విషయాన్ని చెబుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి వింటే.. ప్రాణంగా ప్రేమించే భర్తను తన సుఖాల కోసం.. తన సంతోషానికి స్వార్థంగా చంపేసిన వైనం అయ్యో అనిపించేలా ఉంటుందని చెప్పాలి.
తల్లిదండ్రులు సైతం ఆమె చేసిన ఘోరాన్ని అసహ్యించుకుంటూ ఆమెకు మరణశిక్ష విధించాలని స్పష్టం చేస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. యూపీకి చెందిన సౌరభ్ రాజ్ పుత్.. ముస్కాన్ రస్తోగిలు 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. భార్యకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంలో బంగారం లాంటి జాబ్ ను వదిలేశాడు. అయితే.. అతడి నిర్ణయాన్ని తల్లిదండ్రులు సమర్థించలేదు. దీంతో వారిని వదిలేసి.. భార్యతో కలిసి వేరుగా కాపురం పెట్టాడు. 2019లో వారికి కుమార్తె జన్మించింది.
అయితే.. ముస్కాన్ కు సాహిల్ శుక్లా అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి తెర తీయటమే కాదు.. అతడితో రిలేషన్ కంటిన్యూ చేసుకోవటంపైనే ఫోకస్ చేసింది. వారి బంధం గురించి భర్తకు తెలవటం.. వారిద్దరి మధ్య గొడవలకు కారణమైంది. విడాకులకు సిద్ధమైనప్పటికి కుమార్తె కోసం అతడు విడాకులు తీసుకోలేదు. మళ్లీ మర్చంట్ నేవీలో చేరి యూఎస్ వెళ్లిపోయాడు.
కూతురు పుట్టినరోజు కోసం గత నెలలో భారత్ కు వచ్చాడు. అతడు తిరిగి రావటం భార్యకు నచ్చలేదు. అతడి అడ్డు తొలగించుకోవటానికి వీలుగా.. అతడికి నిద్రమాత్రలతో కూడి డ్రింక్ ఇచ్చింది. మత్తులో జారిపోయిన తర్వాత అతడ్ని 15ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్ లో వేసి సీల్ చేసింది. ఇరుగుపొరుగు వారు అడిగితే వెకేషన్ కు వెళ్లాడని చెప్పింది. అయితే.. సౌరభ్ కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారు రంగంలోకి దిగి సాహిల్.. ముస్కాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ ఘనపై ముస్కాన్ తల్లిదండ్రులు సైతం తీవ్రంగా స్పందించారు. తమ అల్లుడు బంగారమని.. తమ కుమార్తె కారణంగానే చనిపోయాడని.. ఆమె తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకుందని వాపోయారు. ఆమెకు ఉరి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.