నిజంగానే అనూహ్యం. అధికారపక్షంలోనూ.. విపక్ష పార్టీ లోనూ కీలకమైన నేతలకు సంబంధించిన షాకింగ్ పరిణామాలుచోటు చేసుకోవటం.. దానికి సంబంధించిన చర్యలు ఒకే రోజు.. అది కూడా గంటల వ్యవధిలో బయటకు రావటం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుందని చెప్పాలి. అలాంటి ‘సీన్’ తాజాగా ఏపీలో చోటు చేసుకుంది.
అధికార టీడీపీకి సంబంధించి చూస్తే.. జీవీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీని.. పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థులు చీల్చి చెండాడినప్పుడు.. గణాంకాలతో సహా వివరాల్ని టీవీ చర్చల్లో గంటల తరబడి చెప్పటమే కాదు.. చంద్రబాబు తరఫు వకల్తా పుచ్చుకొని వాదించిన వైనం తెలుగు తమ్ముళ్లు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది.
అలాంటి జీవీ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా నియమించటం.. సంస్థకు చెందిన ఎండీతో బేధాభిప్రాయాలు రావటం.. దానికి సంబంధించిన వివరాల్ని దాచుకోకుండా ఓపెన్ కావటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ వెంటనే తనకు అప్పగించిన పదవిని వదిలేసిన జీవీ రెడ్డి రాజీనామా చేసిన వైనం సంచలనంగా మారింది. ఆయన రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే దాన్ని ఆమోదించినట్లుగా పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి నిర్ణయం రావటం ఆసక్తికరంగా మారింది.
కట్ చేస్తే.. వైసీపీకి చెందిన కీలక నేత.. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ ఉదంతం రోటీన్ కు కాస్త భిన్నమైనదిగా చెప్పాలి. విజయవాడలోని ఒక విలాసవంతమైన స్పాకు వెళ్లిన అతను.. వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయినట్లుగా వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. వ్యభిచార గ్రహానికి వచ్చిన శంకర్ నాయక్ పోలీసుల సోదాల వేళ దొరికారని.. మంచం కింద దాక్కొని తప్పించుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు ఆ ఎత్తు పారకుండా అతన్ని మంచం కింద నుంచి బయటకు లాగటం..దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో శంకర్ నాయక్ పై క్రమశిక్షణ చర్యల కత్తిని ఝుళిపించిన వైసీపీ అధినాయకత్వం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఒకే రోజు ఏపీకి చెందిన రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు బయటకు రావటం ఆసక్తికరంగా మారింది.