వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్టు చేసిన సీబీఐ…ఈ కేసు వెనుక ఉన్న అసలు నిందితుల పాత్రపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సీబీఐకి సాక్ష్యమిచ్చిన పలువురు సాక్ష్యులు, జైలులో ఉన్న నిందితులు, అనుమానితుల భద్రత కీలకంగా మారింది. మొద్దు శీను తరహాలో వివేకా కేసులోనూ నిందితులకు ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వరకు అందరూ సీబీఐ అధికారులకు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా వారి భద్రత విషయంలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో ప్రధాన సాక్ష్యులుగా ఉన్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, వాచ్ మెన్ రంగన్నలకు భద్రత కల్పించాలని గతంలో సీబీఐ కోరింది. ఈ అంశంపై విచారణ జరిపిన కడప కోర్టు తాజాగా అందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, తాజాగా దస్తగిరి, రంగన్నలకు గన్ మెన్లను పోలీసులు కేటాయించారు. వారిద్దరికీ వన్ ప్లస్ వన్ గన్ మెన్లను పోలీసు శాఖ కేటాయించింది.
మరోవైపు, వివేకా కేసులో ఏ5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శివ శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో తాను కూడా ఇంప్లీడ్ అవుతానని, తన వాదనలు కూడా వినాలని ఆమె కోరారు.ఏ నిబంధన కింద ఇంప్లీడ్ అవుతారని సునీతారెడ్డి తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. దీంతో, ఈ విషయంపై సమగ్ర వివరాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సునీతా రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు.
ఈ క్రమంలోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇక, జైల్లో ఉన్న ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్ల కోసం కడప కోర్టును, హైకోర్టును కూడా ఆశ్రయిస్తుండడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.