షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం విన్న వారంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది? పార్టీ నేతల క్రమశిక్షణ ఇలా తయారు కావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని సాధించటంతో.. గులాబీ నేతలు.. కార్యకర్తల హడావుడి మామూలుగా లేదు. వారంతా వీర ఉత్సాహంతో హల్ చల్ చేశారు.
ఈ క్రమంలోనే వారు పేల్చిన టపాసులతో తెలంగాణ భవన్ బయట ఏర్పాటు చేసిన పందిరికి నిప్పు అంటిన వైనం తెలిసిందే. ఈ హడావుడిలో మరో ఉదంతం బయటకు రాలేదని చెబుతున్నారు. సికింద్రాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస్ యాదవ్.. పిస్టల్ తో హడావుడి చేశారని చెబుతున్నరు. భారీ సంబరాన్ని జరుపుకునేందుకు.. జేబులో పెట్టుకున్న గన్ బయటకు తీసి.. గాల్లోకి కాలుద్దామని అనుకున్నట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఆయన పక్కనున్న పార్టీ నేతలు అలా చేయొద్దని హెచ్చరించటంతో గన్ ను జేబు లోపల పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకరు తీయటం.. వాట్సాప్ ద్వారా వైరల్ కావటంతో బయటకు వచ్చింది. ఎంత గెలుపు సంబరమైతే మాత్రం.. మరీ ఇంతలా రెచ్చిపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎంతో మంది పార్టీ ముఖ్యులు ఉండే తెలంగాణ భవన్ లోకి గన్ పెట్టుకొని లోపలకు వచ్చేసేలాంటి పరిస్థితి ఆందోళనకు గురి చేస్తుంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు టీఆర్ఎస్ నేతపై పార్టీ అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.