అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఎవరుపడితే వాళ్ళు విచ్చలవిడిగా తుపాకీలను దగ్గర పెట్టుకునే అవకాశాలు పెరిగిపోయింది. అమెరికాలో జనాభా కన్నా తుపాకీలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా జరిగిన అధ్యయనంలో కూడా బయటపడింది. ఒక్కొక్కళ్ళు రెండు మూడు తుపాకులు దగ్గర పెట్టుకుంటున్నారు. ఆత్మరక్షణార్ధం తుపాకులు దగ్గర పెట్టుకుని స్వేచ్చ అమెరికా పౌరులకు వాళ్ళ రాజ్యాంగం, చట్టం అనుమతిస్తోంది.
దీన్ని అడ్డంపెట్టుకుని చాలామంది పౌరులు తుపాకులు కొనేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ఎలాగూ అనుమతులున్నాయి కాబట్టి ఒక్కొక్కళ్ళు మూడు తుపాకులు కూడా కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. తాజాగా న్యూయార్కుకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న బఫెలో లోని ఒక సూపర్ మార్కెట్లో ఒక శ్వేతజాతీయులు 13 మందిని కాల్చి చంపటం సంచలనంగా మారింది. చనిపోయిన వారిలో 11 మంది నల్లజాతీయులు, ఇద్దరు శ్వేతజాతీయులున్నారు.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రపంచదేశాలకు పాఠాలు చెబుతామని చెప్పే అమెరికాలో జాతి వివక్ష విపరీతంగా అమలవుతోంది. అమెరికా అభివృద్ధిలో నల్లజాతీయుల పాత్ర విపరీతంగా ఉంది. అన్నీ రంగాల్లోను నల్ల జాతీయులు దూసుకుపోతున్నారు. అయినా కొందరు శ్వేతజాతీయులు నల్లజాతీయుల విషయంలో విపరీతమైన ధ్వేషం భావనతో ఉన్నారు. దీనికి తాజాగా జరిగిన కాల్పులే ఉదాహరణ. కాలిఫోర్నియాలోని బార్లలో కాల్పులు జరిగాయి. స్కూళ్ళల్లో చిన్నపిల్లలు కూడా తుపాకులు పేల్చి చంపేస్తున్నారు.
కాలేజీల్లో విద్యార్ధులు ప్రొఫెసర్లు, తోటి విద్యార్ధులను చంపేస్తున్నారు. సినిమా థియేటర్లు, పబ్ లు, పార్కులు ఇలా ఎక్కడపడితే అక్కడే యువకులు తుపాకీలతో కాల్పులు జరిపి జనాలను చంపేస్తున్నారు. ఈ మధ్యనే బయటపడిన ఒక అధ్యయనం ప్రకారం అమెరికా జనాభా సుమారు 35 కోట్లయితే లైసెన్సుడు తుపాకులు సుమారు 40 కోట్లకు పైగా ఉన్నాయట. తుపాకులు అమ్మకాలు, కొనుగోళ్ళపై పెద్దగా ఆంక్షలు లేకపోవటంతో కూరగాయల్లాగ తుపాకులు బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా దొరికేస్తున్నాయి. తుపాకులు అందుబాటులో ఉండటం, జాత్యహంకారం బాగా పెరిగిపోవడం, యువతలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుండటం లాంటి అనేక కారణాలతో అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.