రాబోయే ఎన్నికలకు సంబంధించి వైసీపీ లో టికెట్ల గోల పెరిగిపోతోంది. కొందరు ఎంఎల్ఏలకు జగన్మోహన్ రెడ్డి టికెట్లిచ్చేది లేదని ఇప్పటికే చెప్పేశారు. మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలు మార్చారు. ఇంకొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా పోటీచేయమంటున్నారు. అలాగే కొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీచేయిస్తున్నారు. దీంతో పార్టీలో సమస్తం గందరగోళంగా తయారవుతోంది. టికెట్లు దక్కని ఎంఎల్ఏల్లో ఎంతమంది పార్టీలో ఉంటారో ? ఎంతమంది రాజీనామాలు చేస్తారో తెలీక అయోమయం పెరిగిపోతోంది.
ఈ నేపధ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరామ్ వ్యవహారం జిల్లాతో పాటు పార్టీలో చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా ఆలూరు నుండి జయరామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జయరామ్ కు టికెట్ దక్కేది అనుమానమనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే గుమ్మనూరు పై ఉన్న ఆరోపణలే. ఈయన వ్యవహార శైలితో ద్వితీయ శ్రేణి నాయకులు, మెజారిటి క్యాడర్ కూడా బాగా విసిగిపోయినట్లు సమాచారం. అందుకనే జయరామ్ స్ధానంలో ఎంఎల్సీ మధుసూదన్ నాయుడుకు ఎంఎల్ఏగా పోటీచేయించే అవకాశముందనే ప్రచారం పెరిగిపోతోంది.
జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని జయరామ్ ఇప్పటినుండే ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నట్లు టాక్ మొదలైంది. ఒకవేళ జగన్ గనుక తనకు టికెట్ ఇవ్వకపోతే మంత్రి కాంగ్రెస్ లో చేరటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇపుడు వైసీపీలో అసంతృప్తులందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం, సారధ్య బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే కాంగ్రెస్ కు ఒక్కసారిగా ఊపు మొదలైంది. వైసీపీలో టికెట్లు దక్కని వాళ్ళు కాంగ్రెస్ లో చేరి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇప్పటికే మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెప్పారు. వీళ్ళ బాటలోనే మరికొందరు ఎంఎల్ఏలు, మంత్రులు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. జయరామ్ కు మద్దతుగా కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు నాగేంద్ర రంగంలోకి దిగారట. ఇదే సమయంలో ఎంఎల్సీ మధుసూదన్ నాయుడుకు టికెట్ ఇప్పించుకునేందుకు కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు కూడా జగన్ తో మాట్లాడుతున్నట్టు పార్టీలో టాక్ మొదలైంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.