బనియన్ కు తెలియకుండా డ్రాయర్ లాగేయాలి…ఇది డీజే టిల్లు మూవీలోని పాపులర్ డైలాగ్. అంటే, మోసం చేస్తున్నామని తెలియకుండా అవతలోళ్ల దగ్గర నుంచి మొత్తం లాగేయాలి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో మోసపోయేవాడిదే తప్పు..మోసం చేసే వాడివి తెలివితేటలు అన్నట్లు ఉంది ట్రెండ్. ఈ కోవలోకే తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ వైట్ కాలర్ మోసం వస్తుంది. బెట్టింగ్ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టేందుకు ఏకంగా ఫేక్ ఐపీఎల్ మ్యాచ్ లనే ఆడించిందో ముఠా. ఇక, ఆ ముఠా ఉచ్చులో పడి జరుగుతోంది అసలు ఐపీఎల్ మ్యాచులో కాదో తెలుసుకోకుండా….కోట్లు పోగొట్టుకున్నారు కొందరు పరమానందరయ్య శిష్యులు. ఈ బెట్టింగ్ రాకెట్ ను నడిపించేందుకు ఏకంగా ఫేక్ టీంలు తయారు చేసి మరీ మ్యాచ్ లు ఆడించడం కొసమెరుపు.
గుజరాత్‌లోని మెహ్సానా పట్టణానికి కాస్త దూరంలోని మోలిపూర్ గ్రామంలో ఈ కేటుగాళ్లు ఓ పొలాన్ని నెలవారీ అద్దెకు తీసుకున్నారు. అందులో పిచ్ రెడీ చేసి స్థానికంగా ఉన్న 25 మంది రైతులు, కూలీలకు రోజుకు ఐదొందలు ఇస్తామని చెప్పి క్రికెటర్లను చేశారు. వారందరికీ ఐపీఎల్ టీమ్‌ల జెర్సీలను ఇచ్చి…నిజంగానే ఆయా జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. అంపైర్లను పెట్టి, వారికి వాకీటాకీలు ఇచ్చి.. అబ్బో అసలు ఐపీఎల్ జరుగుతుందేమో అనేంత కలరింగ్ ఇచ్చారు. ఈ తతంగాన్ని హెచ్ బీ కెమెరాల్లో బంధించి…యూట్యూబ్‌లో చానల్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. ప్రేక్షకుల గోల, ఈలలు, చప్పట్లు వినిపించేలా సౌండ్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లైవ్‌కు యాడ్ చేశారు. క్రికెట్ కామెంటేటర్ ‘హర్ష భోగ్లే’ వాయిస్‌ను పోలినట్టుగా ఓ వ్యక్తితో కామెంటరీ చెప్పించడం కొసమెరుపు.
రష్యాలోని పబ్‌లు, బార్లలో బెట్టింగ్‌లు నిర్వహించే ఆసిఫ్ మొహమ్మద్ అనే వ్యక్తి ఈ రాకెట్ కు సూత్రధారి. రష్యాలోని పబ్‌లలో పనిచేసి తిరిగి వచ్చిన షోయబ్ దావ్డా అనే గుజరాతీ వ్యక్తితో కలిసి ఇక్కడ ఫేక్ ఐపీఎల్ నిర్వహించారు. చివరకు పంటర్ల అవతారమెత్తి రష్యన్లను బురిడీ కొట్టించి డబ్బులు దండుకున్నారు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు చెప్పడంతో ఈ బెట్టింగ్ బంగార్రాజుల బండారం బయటపడింది. దీంతో, షోయబ్ దావ్డా సహా నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు కేసు పెట్టారు.