పైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా..? అతను ఇప్పుడు మోస్ట్ ఫేమస్ తెలుగు డైరెక్టర్. కేవలం టాలీవుడ్ లోనే కాదు నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. హీరోలను మించి ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నారు. తెలుగు సినిమా స్థాయిని ఆ మాటకొస్తే భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈపాటికే ఆ పిల్లాడు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. మీ గెస్ ఎస్.ఎస్ రాజమౌళి అయితే.. అది నూరు శాతం కరెక్ట్.
రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 1973 అక్టోబర్ 10న కర్ణాటకలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మరియు రాజా నందిని దంపతులకు రాజమౌళి జన్మించారు. వీరి స్వస్థలం పశ్చమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. రాజమౌళి కర్ణాటకలో పుట్టినప్పటికీ.. కొవ్వూరులోనే పెరిగారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిష్యరికం చేయడంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు చెన్నైలోని ఏవిఎమ్ రికార్డింగ్ థియేటర్లో పని చేశారు.
అలాగే క్రాంతి కుమార్ దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రాజమౌళి.. కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించారు. ఆపై శాంతి నివాసం అనే టీవీ సీరియల్‌ను డైరెక్ట్ చేశారు. 2001లో స్టూడెంట్ నంబర్ 1 మూవీతో దర్శకుడిగా వెండితెరపై అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత రాజమౌళి సినీ ప్రయాణం గురించి మనందరికీ తెలిసిందే. రెండున్న దశాబ్దాల సినీ ప్రయాణంలో ఫ్లాప్ అన్న పదమే తన హిస్టరీలో లేకుండా సినిమాలు తీశారు. ఇండియాలోనే నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన ఆస్కార్ ను తెచ్చి తనకు సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించుకున్నారు. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అత్యుత్తమ పురస్కారాలు అందుకున్నారు. అటువంటి రాజమౌళిపై దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ టైటిల్ తో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రాజమౌళి సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. రాజమౌళి చిన్ననాటి ఫోటోలను కూడా చూపించారు. అవే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.