తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీపై మిత్రపక్షం జనసేన ఎన్నికల గుర్తు గాజుగ్లాసు దెబ్బ పడేట్లుంది. దీంతో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు ఎన్నికల కమీషనర్ గుర్తులు కేటాయించారు. జాతీయపార్టీలకు, గుర్తింపు పొందిన పార్టీలకు ఎవరి గుర్తులు వాళ్ళకే ఉంటాయి. కాకపోతే స్వతంత్ర అభ్యర్ధులు, కొన్ని పార్టీలకు మాత్రం గుర్తులు మారుతుంటాయి.
ఇదే పద్దతిలో నవతరం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధికి ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసును ఎన్నికల సంఘం కేటాయించింది. గాజుగ్లాసు పవన్ కల్యాన్ ఆధ్వర్యంలోని జనసేన ఎన్నికల గుర్తన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే జనసేన ఎన్నికల గుర్తును నవతరం పార్టీ అభ్యర్ధికి ఎలా కేటాయించారు ? ఎలాగంటే జనసేనను ఎన్నికల కమీషన్ ఇంకా రాజకీయపార్టీగా గుర్తించలేదు. అంటే ఎన్నికల కమీషన్ గుర్తింపు పొందటానికి సరిపడా అర్హతలు జనసేనకు ఇంకా రాలేదు.
కాబట్టి జనసేన ఎక్కడ పోటీచేయాలన్నా తన ఎన్నికల గుర్తుగా గాజుగ్లాసు కావాలంటే ప్రతిసారి రిక్వెస్టు పెట్టుకోవాల్సిందే. అయితే తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ చేయటంలేదు. కాబట్టి గాజుగ్లాసు గుర్తును ఎవరికైనా ఎన్నికల కమీషన్ కేటాయించచ్చు. ఎన్నికల గుర్తును ఎంచుకోవాల్సొచ్చినపుడు నవతరం పార్టీ అభ్యర్ధి గాజుగ్లాసును ఎంచుకోవటంతో దాన్నే కేటాయించింది కమీషన్.
ఇదే విషయంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే వాళ్ళ అభ్యంతరాలు సాంకేతికంగా పనికిరావు. ఇదే సమయంలో గుర్తులు ఒక్కోసారి పార్టీ అభ్యర్ధుల తలరాతలను మార్చేసే ప్రమాదం కూడా ఉంది. తెలంగాణాలో టీఆర్ఎస్ గుర్తు కారుకు ఇలాంటివి చాలా అనుభవాలే ఉన్నాయి. అదే పద్దతిలో ఇపుడు జనసేన పోటీలో ఉందని అనుకుని ఎవరైనా గాజుగ్లాసుకు ఓట్లేసే ప్రమాదం ఉందని కమలనాదుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
కొసమెరుపు – గుర్తులు కేటాయించే ఎన్నికల అధికారులు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులే. ప్రస్తుతం వారు ఎన్నికల కోసం కేటాయించారు. ఇంకే ముంది. పైనేమో ఎన్నికల కమిషనర్ జగన్ కి మొన్నటిదాకా సలహాదారేమో. కింద ఎన్నికల అధికారులు ఎన్నికలు అయిపోయిన వెంటనే జగన్ ప్రభుత్వంలో పనిచేయాల్సిన ఉద్యోగులు…. దీన్ని బట్టి గ్లాసు గుర్తు ఎందుకు కేటాయించారో, ఎవరు కేటాయించారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.