సంపాదించే అవకాశాలు.. ఖర్చు చేసే మార్గాలు.. పొదుపు చేసే ఛాన్సులు బోలెడన్ని. పాతికేళ్ల క్రితం ఇన్ని అవకాశాలు ఉండేవి కావు. అప్పట్లో పొదుపు అంటే.. బ్యాంకులో డిపాజిట్ చేయటం.. లేదంటే వడ్డీ వ్యాపారంచేయటం.. ఇది కూడా కాదంటే బంగారం కొనుక్కోవటమే. కానీ.. ఇప్పుడు మాత్రం బోలెడన్ని అవకాశాలున్నయి. 30 ఏళ్ల క్రితం తన తాత కొన్న ఎస్ బీఐ షేర్లను డాక్టర్ అయిన మనమడు గుర్తించారు. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. దాని విలువపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
అప్పట్లో రూ.500 పెట్టి కొనుగోలు చేసి కొన్న వాటాల విలువ ఇప్పుడు ఎంతగా ఉందన్న విషయాన్ని తన పోస్టులో వెల్లడించారు. చండీగఢ్ కు చెందిన డాక్టర్ తన్మయ్ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు. ఆయన తాత 1994లో రూ.500 విలువైన ఎస్ బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్నదే లేదు. ఇటీవల కుటుంబ ఆస్తుల్ని ఒక చోట చేర్చిన సందర్భంలో అప్పట్లో రూ.500 విలువ (ముఖ విలువ రూ.500. కానీ అప్పట్లో వాటి విలువ రూ.5వేలు) చేసే ఎస్ బీఐ షేర్లను కూడా గుర్తించారు. వాటిని కొన్నారే కానీ తర్వాత వాటి గురించి మర్చిపోయారు.
అయితే.. తాజాగా వాటి వాటా విలువను లెక్కించి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి కారణం ఎలాంటి డివిడెండ్లు కలపకుండానే వాటి విలువ రూ.3.75 లక్షలు అయినట్లుగా పేర్కొన్నారు. 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్నులు ఇవ్వటం సాధారణ విషయం కాదంటూ పోస్టు పెట్టిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.3.75 లక్షలు పెద్ద మొత్తం కాకున్నా.. తన తాత పొదుపు విషయంలో ప్రదర్శించిన ముందుచూపును ప్రస్తావించారు.
ఈ స్టాక్స్ ను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చేందుకు ఒక కన్సల్టెంట్ ను సంప్రదించినట్లుగా మోతీవాలా పేర్కొన్నారు. ఇది కాస్తా క్లిష్టమైన వ్యవహారమే అయినప్పటికీ దానికి కొంత సమయం పడుతుందన్నారు. అయితే.. తాను ఆ వాటాల్ని అమ్మాలని అనుకోవటం లేదని సదరు వైద్యుడు తెలిపారు. ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాల్ని..అభిప్రాయాల్ని అందులో పేర్కొన్నారు.