స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్లే దారిపొడువునా చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా చంద్రబాబుకు పూలబాట వేసి నినాదాలు చేశారు. అందుకే, దాదాపు 15 గంటలపాటు నిర్విరామంగా ప్రయాణించి చంద్రబాబు బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు.
అయితే, చంద్రబాబు నివాసం దగ్గర కూడా ఆయనను చూసేందుకు అమరావతి రైతులు, మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చంద్రబాబుకు దిష్టి తీసి హారతులిచ్చి స్వాగతం పలికారు. అంతకుముందు, విజయవాడ నగరంలోి బెంజ్ సర్కిల్ ప్రాంతానికి చంద్రబాబు చేరుకోగానే అప్పటికే వేలాది సంఖ్యలో అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలు, నేతలు జై చంద్రబాబు…జై తెలుగుదేశం అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో భారీ సంఖ్యలో ప్రజలు చంద్రబాబును చూసేందుకు రావడం వచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆయన నివాసం వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, కేశినేని చిన్ని తదితరులు ఇంటి దగ్గర ఘన స్వాగతం పలికారు.. చంద్రబాబుకు వేద పండితులు హారతినిచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబుకు గుమ్మడికాయ కొట్టి మహిళలు దిష్టి తీశారు. చంద్రబాబు రాక నేపథ్యంలో ఆయన నివాసానికి బాలకృష్ణ సతీమణి వసుంధరతోపాటు బాలకృష్ణ, సోదరుడు నందమూరి రామకృష్ణ, నందమూరి, నారా కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.