టీడీపీ అగ్రనేత నారా లోకేష్ కడపలో పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రవీణ్ రెడ్డి ఇంటిపై దాడి చేయడమే కాకుండా బాధితుడైన ప్రవీణ్ రెడ్డిని మూడ్రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తెల్లవారుఝామును ఇంట్లోకి జొరబడి..ప్రవీణ్ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ ఘటనను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగానే కడప జైల్లో ఉన్న ప్రవీణ్ రెడ్డిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడపలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే లోకేష్ ను రిసీవ్ చేసుకునేందుకు కడప విమానాశ్రయం వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఎయిర్ పోర్టు వద్ద లోకేష్ కు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లోకేష్ వస్తున్నారని తెలియడంతో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయం పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో, ఎయిర్ పోర్టు దగ్గర ఇసకేస్తే రాలనంత జనంతో రోడ్లన్నీ పసుపుమయ్యాయి.
ప్రవీణ్ రెడ్డి ఉన్న కడప సెంట్రల్ జైలుకు రోడ్డు మార్గంలో లోకేష్ చేరుకొని ఆయనను పరామర్శించనున్నారు. ప్రవీణ్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు లోకేష్ తో పాటు మరో 17 మంది నేతలకు అనుమతినిచ్చారు. లోకేష్ పర్యటనను భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులను అదుపుచేసేందుకు పోలీసలు భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు
అంతకుముందు, లోకేష్ కడప జిల్లా పర్యటనకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కడపకు చెందిన టీడీపీ నేత రాంప్రసాద్ కు రిమ్స్ పోలీసులు ఓ నోటీసును జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడరాదని నోటీసుల్లో సూచించారు. తమ సూచనలను పట్టించుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఈ నోటీసు కాపీని లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ జగన్ పై సెటైర్లు వేశారు. ‘ప్యాలెస్ పిల్లి భయపడింది’ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.