రైతుల పోరాటం ఫలించిందా? కేంద్రం రైతుల చట్టంపై వెనక్కు తగ్గిందా? రైతు సంఘాల ప్రతినిధులతో పదో విడత చర్చల అనంతరం వెలువడిన సమాచారం చూస్తే ఇదే నిజం కాబోతుందని పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చి మూడు చట్టాలను తాత్కాలికంగా మూలన పడేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఎన్ని సవరణలు పెట్టినా రైతులు ఒప్పుకోకపోవడంతో కేంద్రం వెనక్కు తగ్గకపోతే రాజకీయంగా తీవ్ర నష్టాల పాలవుతామని భావించినట్లు అర్థమవుతోంది.
ఇప్పటివరకు జరిగిన 9 చర్చలు ఫెయిలయ్యాయి. పదోసారి జరిగిన చర్చల్లో రైతులకు మోడీ సర్కారు తలొగ్గక తప్పలేదు. 2 సంవత్సరాల పాటు ఈ చట్టాలను ముట్టుకోం అని కేంద్రం హామీ ఇచ్చినట్లు రైతు సంఘాలు వెల్లడించారు. రైతుల సంఘాల ప్రతినిధి కవిత కూరగంటి కేంద్రం ఈ మేరకు హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
అయితే, టెంపరరీ నిలిపివేతకు కారణమేంటో అర్థం కావడం లేదు గాని… ఈ తాత్కాలిక నిలిపివేత ఒక వ్యూహం అనిపిస్తుంది. ఇలా రెండు దఫాలుగా చట్టాలు తెరమీదకు తెస్తే ఉద్యమం పలుచన అవుతుందేమో అన్న ఆలోచన కూడా కేంద్రం చేసి ఉండొచ్చు. లేదో రైతుల్లో ఎడతెగని పోరాట పటిమ కేంద్రాన్ని డైలమాలో పడేసి ఉండొచ్చు. లేదా ఇటీవలే గత వారంలో రెండు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా రావడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు.
ఇక తాజా చర్చల్లో రైతులు, ప్రభుత్వ ప్రతినిధులతో సంయుక్తంగా కమిటీ ఏర్పాటు దిశగా అడుగుపడింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం ఇరువురిలో వ్యక్తమైంది. కేంద్రం తాజా ప్రతిపాదనపై రైతు సంఘాల నేతలు రేపు సింఘు బోర్డర్ వద్ద సమావేశం కానున్నారు. అనంతరం ఈనెల 22న జరిగే భేటీలో కేంద్రానికి తమ అభిప్రాయాన్ని రైతు సంఘాల నేతలు తెలియజేయనున్నారు.