- అదనపు ఏజీగా జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు
- గొప్ప పేరులేకున్నా నియామకం
- 4 నెలల్లోనే ‘ఆర్థిక ప్రయోజనాలు’ పెంపు
- రోజుకు రూ.68 వేలు దక్కేలా ఉత్తర్వులు
- సీబీఐ కేసుల్లోని సొంత లాయర్‌కూ
- 96 లక్షలు సమర్పణ
సొంత మీడియాలో పని చేసే వారిని ప్రభుత్వ సలహాదారులుగా, కన్సల్టెంట్లుగా, పీఆర్వోలుగా నియమించుకుని.. రూ.కోట్లకొద్దీ ప్రజాధనాన్ని అప్పనంగా జీతభత్యాల కింద చెల్లిస్తున్న జగన్ సర్కారు.. ఇప్పుడు సన్నిహిత లాయర్లకూ ప్రభుత్వ ధనాన్ని ఇబ్బడిముబ్బడిగా కట్టబెడుతోంది.
ఈ విషయంలో నిబంధనలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులు పట్టించుకోదు. సీఎం ముఖ్య కార్యదర్శి ఆదేశిస్తారు.. ఉన్నతాధికారులు తక్షణమే జీవోలు జారీచేసేస్తారు. రాష్ట్ర అదనపు అడ్వకేట్స్ జనరల్(ఏఏజీ)కు కళ్లు తిరిగే తాయిలాలు అందిస్తున్నారు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ (ఏజీ), ఏఏజీ ఉంటారు.
ఆంధ్రలో ఏజీ ఎస్.శ్రీరాం, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఉండగా.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడైన జాస్తి నాగభూషణాన్ని ఇంకో ఏఏజీగా ఆగమేఘాలపై నియమించారు. ఇంతటితో సరిపెట్టకుండా ఏజీకి మించి ఏఏజీలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్న వైనం చూసి న్యాయవాద, అధికార వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఒక వ్యక్తి కోసం ‘వ్యవస్థ’నే మార్చేస్తున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇచ్చిన లేఖ ఆధారంగా గత ఏడాది డిసెంబరు 9న నాగభూషణాన్నిఏఏజీగా నియమిస్తూ జీవో జారీచేశారు. 2000 సంవత్సరంలో విడుదల చేసిన జీవో 187, 2016లో వచ్చిన జీవో 219 ఆధారంగా ఆయనకు వేతనం, అలవెన్సులు, ఇతర సదుపాయాలు ఉంటాయని ఉత్తర్వులో పేర్కొన్నారు.
వాస్తవానికి నాగభూషణం ఉమ్మడి హైకోర్టులో గానీ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాషా్ట్రల హైకోర్టుల్లో గానీ పెద్దగా పేరున్న న్యాయవాది కాదు. అయినా సరే.. కీలకమైన ఏఏజీ పోస్టు అదనంగా సృష్టించి మరీ కట్టబెట్టారు. కేవలం జస్టిస్ చలమేశ్వర్‌కు కృతజ్ఞత తెలుపడం కోసమే భూషణ్‌కు ఈ పోస్టు ఇచ్చారని అప్పట్లోనే చర్చ జరిగింది. విషయం ఈ నియామకంతో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు సమకూర్చారు.
రోజువారీ సిట్టింగ్‌ల (కేసుల్లో అటెండ్ కావడం) సంఖ్యను, ఒక్కో సిట్టింగ్‌కు చెల్లించే పారితోషికాన్ని అమాంతం పెంచేశారు. 2016లో జారీ చేసిన జీవో ప్రకారం ఏఏజీకి ఒక సిట్టింగ్‌కు రూ.7,500 చొప్పున చెల్లించాలి. ఒకరోజులో గరిష్ఠంగా ఐదు సిట్టింగ్‌లు మాత్రమే ఉండాలి.
తాజాగా.. ఒక్కో సిట్టింగ్‌కు ఇచ్చే పారితోషికాన్ని రూ.8,500 చేశారు. పెంచింది వెయ్యి రూపాయలే కదా అని అనుకోవద్దు. సిట్టింగ్‌ల సంఖ్యను 5 నుంచి 8కి పెంచేశారు. అంటే… ఏఏజీకి గతంలో రోజుకు గరిష్ఠంగా రూ.37,500 పారితోషికం లభించేది. ఇప్పుడు అది ఏకంగా రూ.68 వేలకు చేరింది. అంటే… దాదాపు రెట్టింపు!
ఈ ‘పెంపు’ ఉత్తర్వు వెలువడిన సరిగ్గా మూడు రోజులకు, అంటే ఈ ఏడాది మార్చి 15న సర్కారు మరో జీవో జారీ చేసింది. ఇందులో… ఏఏజీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)తో సమానంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాదు.. హెచ్ఆర్ఏకు సమానంగా ఆఫీసు అలవెన్సు కూడా ఇవ్వాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి 2019 జూన్‌లో ఏఏజీగా నియమితులయ్యారు. ఆయన ఒక్కరే ఏఏజీగా ఉన్నప్పడు ఇలాంటి భారీ పెంపులు లేనే లేవు. అసాధారణ రీతిలో నాగభూషణ్‌ను రెండో ఏఏజీగా నియమించుకోవడంతోపాటు, ఆ తర్వాత నాలుగు నెలల్లోనే ఏఏజీలకు అందే ఆర్థిక ప్రయోజనాలను పెంచుతూ పోవడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం తరఫు ప్రధాన న్యాయవాది ఏజీ. ఆయన ‘లీడర్ ఆఫ్ ది బార్’ కూడా. కానీ జగన్ సర్కారు కొన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏజీకి మించి ఏఏజీలకు కల్పించింది. ఏజీకి రోజుకు ఐదు అప్పియరెన్స్‌లకు మాత్రమే ఫీజు చెల్లిస్తారు. ఏఏజీలకు మాత్రం 8 అప్పియరెన్స్‌లకు చెల్లించాలని నిర్ణయించారు.
హెచ్ఆర్ఏ కూడా ఏజీకంటే ఏఏజీకే ఎక్కువ. దీంతోపాటు… ‘పారితోషికం’ కోసం మరో తతంగం కూడా నడుస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అనేక కేసులు దాఖలవుతున్నాయి. వాటిలో వాదించేందుకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ఇతర సీనియర్ న్యాయవాదులను ప్రభుత్వం నియమించుకుంటోంది. ఆ కేసుల్లో కూడా కంప్యూటర్లో లాగిన్ అయి అదనపు అడ్వొకేట్ జనరల్ పాల్గొంటున్నారని.. వాటికీ ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోందని సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏఏజీలకు ఈ స్థాయి ప్రత్యేక ‘మేళ్లు’ జరగలేదు. పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోనూ ఈ తరహా పెంపుదల లేదు. ఏఏజీకి కర్ణాటకలో రోజుకు ఒక కేసుకు రూ.10వేలు చెల్లిస్తారు. ఆ తర్వాత ఎన్ని కేసులు అటెండ్ అయినా.. కేసుకు రూ.వెయ్యి చొప్పున గరిష్ఠంగా రోజుకు రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తారు.
‘జాస్తి’ రుణం తీర్చుకోవడానికేనా?
మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ రుణం తీర్చుకోవడానికే ఆయన కుమారుడిని జగన్‌రెడ్డి అందలాలు ఎక్కిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడానికి.. దానిపై దాడిచేసేందుకు జస్టిస్ చలమేశ్వర్ సేవలను జగన్‌రెడ్డి వాడుకున్నారని.. దానికి ప్రతిఫలంగానే ఆయన కుమారుడిని ఏఏజీగా నియమించారని టీడీపీ ఆరోపిస్తోంది.
న్యాయవ్యవస్థపై ఎదురుదాడిలో భాగంగా అమరావతి భూముల కుంభకోణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు పాత్ర ఉందని ఆరోపిస్తూ నిరుడు సెప్టెంబరు 15వ తేదీన జగన్ ప్రభుత్వం కేసు పెట్టింది. ఆ తర్వాత వారానికి జాస్తి నాగభూషణాన్ని వెంటేసుకుని ప్రత్యేక విమానంలో జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్టోబరు 6న ఇదే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు.
లేఖ తయారీలో చలమేశ్వర్, ఆయన కుమారుడు నాగభూషణం సహాయ సహకారాలు తీసుకున్నారు. డిసెంబరు 8న నాగభూషణం ఏఏజీగా నియమితులయ్యారు’ అన్న ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి నీతి వాక్యాలు చెప్పిన జస్టిస్ చలమేశ్వర్ ఇప్పుడు ఒక ఆర్థిక నేరగాడికి ఎలా సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సొంత లాయర్లకు..
మరోవైపు.. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా దాఖలైన కేసులు, హెబియస్ కార్పస్ పిటిషన్లలో రాష్ట్రప్రభుత్వం తరఫున వాదించిన ఇద్దరు న్యాయవాదులకు రూ.1.37 కోట్లు ఫీజుగా చెల్లించారు. ఇందులో సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి ఒక్కరికే రూ.96 లక్షలు ఇచ్చారు. మరో రూ.38.50 లక్షలను మాజీ ఏజీ, సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డికి చెల్లించారు.
నిరంజన్‌రెడ్డి… రాజధాని కేసులతోపాటు హెబియస్ కార్పస్ పిటిషన్లలోనూ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. ఏజీ, ఏఏజీలు ఉన్నప్పటికీ.. సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావించే కేసుల్లో బయటి లాయర్లను నియమించుకోవడం సహజమే. అయితే నిరంజన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు ఎన్నేళ్ల నుంచో సొంత లాయరు కూడా!
జగన్‌పై దాఖలైన సీబీఐ కేసుల్లో ఆయనే వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా… జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లోనూ జగన్ తరఫు న్యాయవాది ఆయనే. వెరసి.. తనపై ఉన్న సొంత కేసుల్లో వాదించే న్యాయవాదికే, సర్కారు కేసుల్లో వాదించే అవకాశం కూడా కల్పిస్తూ… భారీగా ఫీజులు చెల్లిస్తున్నారన్న మాట!
హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఒకరోజు వాదనలు వినిపించినందుకు నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. సొంత న్యాయవాదికి ప్రభుత్వ కేసులు అప్పగించి… ఇంత భారీ మొత్తం చెల్లించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు నుంచి పెద్ద లాయర్లను పిలిచినప్పుడూ ఇంత ఫీజు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇది కూడా ఒకరకంగా ‘క్విడ్‌ప్రొకో’ లాంటిదే అనే విమర్శలూ వినిపిస్తున్నాయి.