ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం ఏపీ ఆర్థిక శాఖ పడుతున్న తిప్పలు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ ఆర్థిక శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఖజానా లోటును భర్తీ చేయాలనుకున్న జగన్ కు బ్యాంకర్లు కూడా హ్యాండ్ ఇచ్చారని టాక్ వచ్చింది.
ఇక, ఏపీలో అప్పుల తిప్పలపై ప్రధాని మోడీ కూడా ఫోకస్ పెట్టారు. జగన్ అప్పులపై ఆరా తీసిన మోడీ…ఆ వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)ను ఆదేశించడం తెలిసిందే. ఏపీలో ఏం జరుగుతోందని, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేయడమేమిటని మోడీ ఫైర్ అయ్యారని కూడా టాక్ వచ్చింది. ఇంత జరుగుతున్నాసరే…జగన్ కు మాత్రం ఏనుగు మీద వాన పడ్డట్లే ఉందని అనుకోక తప్పదు. ఎందుకంటే ఈ సారి జగన్ తీసుకున్న అప్పుకు సంబంధించిన ఒప్పంద పత్రంలో ఏకంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరును కూడా ఇరికించడం సంచలనం రేపింది.
వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) ద్వారా రూ. 25 వేల కోట్ల రుణం తీసుకోవాలని భావించిన ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒప్పంద పత్రంలో గవర్నర్ హరిచందన్ పేరు చేర్చింది. అయితే, ఈ విషయం ఆనోట ఈనోట పడి గవర్నర్ కు తెలిసింది. దీంతో, ఆయన ఈ వ్యవహారంపై ఫైర్ అయ్యారట. తన పేరు ఎలా వాడతారంటూ మండిపడ్డారట. దీంతో, జగన్ అండ్ కో దిద్దుబాటు చర్యలకు దిగిందట.
గవర్నర్‌కు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు రాజ్‌భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.
మరోవైపు, ఈ తరహా రుణ ఒప్పందాల్లో గవర్నర్ పేరు చేర్చడాన్ని ఏపీ హైకోర్టు కూడా తప్పుబట్టింది. దీంతో, ఆ ఒప్పందంలో గవర్నర్ పేరు తొలగించి కొత్తగా మళ్లీ ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయా? అన్న కోణంలో జగన్ అండ్ కో యోచిస్తోందట.
బ్యాంకులు కనుక ఒకవేళ నోటీసులు ఇవ్వాల్సి వస్తే వాటిని పంపించాల్సిన చిరునామా కింద గవర్నర్ చిరునామా ఇవ్వడంతో హరిచందన్ మండిపుతున్నారట. అంతేకాదు, గ్యారంటీ ఒప్పంద పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున సంతకాలు పెట్టాల్సిన ప్రతి చోట ‘ఆంధ్రప్రదేశ్ గవర్నర్’ అని పేర్కొన్నారట. అయితే, ప్రభుత్వపరంగా ఇటువంటి వ్యవహారాల్లో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే ఉపయోగించేవారు.
కానీ, జగన్…మా అప్పులకు గవర్నర్ హరిచందన్ కూడా గ్యారెంటీ అనే ఫీలింగ్ కోసమో…మరి దేనికోసమో తెలీదుగానీ…ఏకంగా ఆయన పేరును ఈరకంగా వాడేశారట. అయితే, జగన్ కు అప్పు ఇవ్వబోమని బ్యాంకులు ససేమిరా అనడంతో….మా వెనుక గవర్నర్ వ్యక్తిగత హోదాలో కూడా ఉన్నారని నమ్మకం కలిగించేందుకే జగన్ ఇలా చేశారని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.