జగన్ సర్కార్ పై ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాటపట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, వారిని బుజ్జగించేందుకు ప్రభుత్వ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అనూహ్యంగా పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది. అన్ని జిల్లాలలోని కలెక్టరేట్లను ముట్టడించాలన్న ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు ప్రకారం టీచర్లు కలెక్టరేట్లను ముట్టడించారు.
గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, కడప కలెక్టరేట్ల వద్దకు టీచర్లు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఆందోళన చేస్తున్న టీచర్లు కలెక్టరేట్ల లోపలికి వెళ్లకుండా భారీగా పోలీసులను మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
నిన్న రాత్రి నుంచే ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
కడపలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించి పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు నుంచి కడప కలెక్టరేట్ కు వెళుతున్న ఉపాధ్యాయులను అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ అరెస్ట్ లకు నిరసనగా నెల్లూరు జిల్లాలోని వెంకటాపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కుప్పం, పలమనేరు నుంచి చిత్తూరుకు వెళుతున్న టీచర్లను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారని, రేపు ఇతర ఉద్యోగులు రోడ్డెక్కుతారని జోస్యం చెప్పారు. వారిని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మారుస్తారా? అని ప్రశ్నించారు. ‘మీకేం.. అటూ ఇటూ కాకపోతే అక్కడకు వెళ్లి కూర్చుంటారు… రాష్ట్ర ప్రజల మాటేంటని’ ఎద్దేవా చేశారు. ఒక పక్క కరోనా, మరో పక్క అధోగతిలో ఆర్థిక పరిస్థితి… ఇంకేంటి పరిస్థితి అని వర్ల రామయ్య చురకలంటించారు. తెలివిలేని సలహాదారుల సలహాలతో సతమతమవుతున్నారుగా సీఎం గారూ? అంటూ ఎద్దేవా చేశారు.