ఏపీ సీఎం జగన్ చేస్తున్న అప్పులు, వాటికోసం పడుతున్న తిప్పలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం మొదలు కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకోవడం వరకు…నిండుకున్న ఖజానాను నింపడానికి జగన్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావని టాక్. ఇక, దీంతో పాటు ఒక శాఖ నిధులు మరో దానికి మళ్లించడం…సంక్షేమ పథకాల అమలుకోసం తిమ్మిని బమ్మిని చేయడం వంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఇక, తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసిన డీఏ ఏరియర్స్ సొమ్మును ప్రభుత్వం వెనక్కు తీసుకొని వాడేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చెప్పకుండానే వారి సొమ్మను వెనక్కు తీసుకోవడం ఏమిటని ఆయన నిలదీశారు.ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీఎఫ్ ఎంఎస్, ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీపీఎఫ్ ఖాతాల్లోని ఉద్యోగుల డబ్బుకు భద్రత ఉందా అనే అనుమానం కలుగుతోందని వాపోయారు. సీపీఎస్ రద్దు, డీఏల చెల్లింపు, పీఆర్సీ అమలు హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ విమర్శించారు.ఇక, ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించేలా ఒక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఒకటో తేదీకే జీతాలు చెల్లించేలా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లు పెట్టాలని అన్నారు. ఒకటో తేదీన కాకపోయినా…ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామంటూ బుగ్గన వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని, దానిని ప్రభుత్వం ఆదాయవనరుగా చూడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక అకౌంట్ పెట్టి ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు పెండింగ్లో పెట్టకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.