ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ఎపిసోడ్ గతంలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ వైసీపీ నేతల ఎపిసోడ్ యావత్ దేశం హైలైట్ అయింది. చివరకు, సుప్రీం కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ తన పదవిని దక్కించుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మినహా మిగతావి పూర్తి చేశారు. అయితే, నిమ్మగడ్డ మీద కారాలు మిరియాలు నూరిన వైసీపీ నేతలు….ఆ ఎన్నికలు కూడా ఆయన చేతుల మీదుగా జరిపించాలంటూ విన్నపాలు చేసినా ఫలితం దక్కలేదు.
దీంతో, హుటాహుటిన ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్నిని ఏపీ ఎస్ఈసీగా జగన్ నియమించడం, ఆమె చార్జ్ తీసుకున్న వెంటనే పదిరోజుల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. అయితే, సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికలపై కొందరు కోర్టును ఆశ్రయించారు. అనేక విచారణల తర్వాత తాజాగా ఆ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరిగింది.
దీంతో, ఆ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసిందంటూ వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటుగా స్పందించారు. ఊహించిన గెలుపునకు బాజాలు ఎందుకని గోరంట్ల చురకలంటించారు.
అవి ‘ఎలక్షన్స్ కాదు సెలెక్షన్స్’.. అని గోరంట్ల సెటైర్లు వేశారు. ప్రజా స్వేచ్ఛని హరించి వైసీపీ నేతలు పరిషత్ ఎన్నికల్లో గెలిచారని గోరంట్ల అన్నారు. ఆ కారణంతోనే ఎన్నికల్లో టీడీపీ నామమాత్రంగా పోటీ చేసిందని అన్నారు. అసలు, టీడీపీ బహిష్కరించిన ఎన్నికల్లో ఘోర ఓటమి ఏంటని, వైసీపీ ఏకపక్ష విజయం ఏంటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.