వైసిపి నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు ఆరోపణలు రావడం, ఆ వీడియోలో ఉన్నది మాధవ్ అంటూ టిడిపి నేతలు ఫోరెన్సిక్ నివేదికతో సహా గుట్టురట్టు చేయడం షాకింగ్ గా మారింది. అయితే, ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అది మార్ఫింగ్ వీడియో అని మాధవ్ బుకాయిస్తూ వచ్చారు.
ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో తాజాగా మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అనంతపురంలో మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించడం లేదని ఆ ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, అద్దె బకాయి అడిగితే మాధవ్ అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశారు.
అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు మధ్యవర్తులుగా మారి సమస్యను సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతపురం ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ పంచాయతీ జరిగినట్టుగా సమాచారం. అయితే, తనకు రావలసిన బకాయిలు ఇప్పించి ఇంటిని ఖాళీ చేయాలని మల్లికార్జున రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంలోని రామ్ నగర్ లో మాధవ్ అద్దెకుంటున్నారు. అయితే, ఆ ఇంటి అద్దె, కరెంటు బిల్లులు మొత్తం కలిపి దాదాపు రెండు లక్షలకు పైగా బకాయిపడ్డారని మల్లికార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు.
బకాయి డబ్బులు అడిగితే టిప్పర్లతో తొక్కించి చంపేస్తామని మాధవ్ అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన అద్దెబకాయిలు చెల్లించకుండా బెదిరింపులకు గురి చేస్తున్న మాధవ్ వ్యవహార శైలికి నిరసనగా మాధవ్ ఇంటి ముందు ధర్నా చేయాలని మల్లికార్జున రెడ్డి భావించారని తెలుస్తోంది. దీంతో మల్లికార్జున రెడ్డితో పోలీసులు మాట్లాడి సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే, సమస్య కొలిక్కి రాకపోవడంతో మరోమారు చర్చలు జరిపేందుకు వారు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇలా, ఉంటున్న ఇంటి అద్దె చెల్లించకుండా మరో ‘డర్టీ’ వివాదంలో గోరంట్ల మాధవ్ చిక్కుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.