భారత్ ను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండడం, సెకండ్ వేవ్ లో రోగులకు భారీస్థాయిలో ఆక్సిజన్ కొరత ఏర్పడడం వంటి అంశాలు అంతర్జాతీయ మీడియాలో సైతం హైలైట్ అయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ లోని పలు రాష్ట్రాల్లో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పడంతో పాటు భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారు.
తాజాగా కరోనా దెబ్బకు తల్లడిల్లుతున్న భారత్ కు గూగుల్ రూ.113 కోట్ల భారీ సాయం ప్రకటించింది. దేశంలో 80 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వివిధ అంశాలకు ఈ నిధులు వెచ్చించనుంది. దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచడం, ఆరోగ్య సౌకర్యాలకు ఈ డబ్బు ఖర్చు చేయనుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టిన గివ్ ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వనుంది.
గివ్ ఇండియాకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకురూ.18.5 కోట్లు ఇవ్వనుంది. 15 రాష్ట్రాల్లో 1.80 లక్షల ఆశావర్కర్లకు, 40 వేల ఎన్ఎంలకు శిక్షణ కోసం ఆర్మన్ సంస్థకు రూ.3.6 కోట్లు అందించనుంది. 20 వేల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ చేపడుతున్న అపోలో మెడ్ స్కిల్స్ కు ఆర్థిక సాయం చేస్తామని కూడా గూగుల్ ప్రకటించింది. గత ఐదేళ్లలో భారత్కు 57 మిలియన్ డాలర్ల విలువైన సాయాన్ని గూగుల్ అందించింది.