ఆకాశమే హద్దుగా దూసుకెళ్లే బంగారం దూకుడుకు బ్రేక్ పడింది. ఒక్కరోజులో భారీగా ధర తగ్గటం ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర రోజులో 80 డాలర్లు (సుమారు రూ.6,500) వరకు తగ్గటం విశేషం. వెండి కూడా అదే రేంజ్ లో ధర తగ్గింది. ఎందుకిలా జరిగింది? దానికి కారణం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం రాత్రి 11 గంటల వేళకు 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) రూ.89,800 ట్రేడ్ అవుతోంది. ఏప్రిల్ 1న మేలిమి బంగారం పది గ్రాములు రూ.94 వేలకు టచ్ కాగా.. ఇప్పుడు రూ.3వేల వరకు తగ్గటం గమనార్హం. కిలో వెండి ధర కూడా రెండు రోజుల్లో రూ.12వేలకు పైగా తగ్గింది. అదే పనిగా దూసుకెళ్లే బంగారం ధర దూకుడుకు ఎందుకు బ్రేకులు పడ్డాయి? అన్న అంశంలోకి వెళితే.. దీనికి కారణాలు లేకపోలేదు.
గత ఏడాది వ్యవధిలో పెరిగిన బంగారం ధర 35 శాతం. అందులో ఈ ఏడాదిలోనే 20 శాతం ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీ దిద్దబాటుకు కాణంగా మదుపర్ల లాభాల స్వీకరణగా చెబుతున్నారు. భారీగా బంగారం ధరలు పెరగటంతో అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లుగా చెబుతున్నారు. ఇదే ధర తగ్గటానికి కారణమైంది. మరోవైపు ఆభరణాల అమ్మకాలు దాదాపు 70 శాతం తగ్గిపోయాయి. వీలైనంత వరకు పాత ఆభరణాల్ని మార్చుకోవటం.. కొత్తవి తీసుకోవటం ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. బంగారం డిమాండ్ తగ్గటం కూడా ధరలు తగ్గేందుకు కారణమైనట్లుగా చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్ లు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో పసిడి ధరలు గరిష్ఠంగా నిలిచే అవకాశం లేదంటున్నారు. ఈ కారణంతోనే ఇందులో పెట్టుబడి పెట్టిన మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించి.. యుద్ధ విరమణ చోటు చేసుకుంటే బంగారం ధర మరింత దిగి వస్తుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో అత్యవసరం అయిన వారు మినహా మిగిలిన వారు బంగారం కొనుగోలు అంశంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం మంచిదని చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల్ని పరిశీలిస్తూ.. సరైన సమయంలో బంగారం..వెండి కొనటం మంచిదని.. లేకుంటే నష్టపోవొచ్చంటున్నారు. సో.. జర జాగ్రత్త సుమి.