ప్రస్తుతం జరుగుతున్న ‘తానా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు, మధ్యే వాదుల అభిమాని అయిన ‘శ్రీనివాస గోగినేని’ పోటీ నుంచి తప్పుకుంటూ ‘డాక్టర్ నరేన్ కోడాలి’ కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
గత వారాంతం మిచిగాన్ లోని తన స్వగృహంలో కలిసిన ‘నరేన్ కొడాలి’ తో ‘తానా’ ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు పై విపులం గా చర్చించినట్లు తెలిపారు. ‘గోగినేని’ కృషి చేయాలని ఆశిస్తున్న అనేక విషయాలపై ‘నరేన్’ కూడా అంగీకరిస్తూ వాటిని సాకారం చేయడానికి కలిసి పని చేయడానికి ముందుకు రావడం, ‘తానా’ సమగ్రతకై ప్రస్తుత వర్గ పోరాటాల్లో ఎవరో ఒకరు పూర్తి ఆధిపత్యం తాత్కాలికంగానైనా అత్యవసరమని భావించడం, కొన్ని ముఖ్య కార్యక్రమాల కొరకై సుమారు 250,000 డాలర్స్ ‘నరేన్’ సొంతంగా సమకూర్చుతూ మరో 500,000 డాలర్స్ సమీకరణకు వ్యక్తిగత హామీ ఇవ్వడం తన నిర్ణయానికి ముఖ్య కారణమని ‘తానా’ సభ్యులందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. ఆ విషయంగా తనకు చేతనైనంత వరకు ‘నరేన్’ విజయానికి కృషి చేస్తానని కూడా ‘గోగినేని’ తెలిపారు.
మరి ఇప్పటికే దూకుడు మీద ఉన్న ‘నరేన్ కొడాలి’ వర్గానికి ‘గోగినేని’ మద్దతుతో మరింత దన్ను సమకూరి ఎన్నికల విజయం నల్లేరు మీద నడక అవ్వవచ్చునని అదే సమయంలో ఈ విషయం ప్రతర్ది వర్గానికి తీరని నష్టమని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి వర్గానికి లీడ్ గా ఉంటూ ‘టీం గోగినేని’ పేరుతో ఉధృత ప్రచారం కొనసాగించినప్పటికీ ఆ ఎన్నికలను మధ్యలో ‘తానా’ బోర్డ్ రద్దుచేసి అక్రమంగా ‘సెలక్షన్’ ప్రక్రియ ద్వారా అన్ని పదవులను భర్తీ చేయడం, దానిని మేరీల్యాండ్ కోర్ట్ చట్ట విరుద్ధంగా భావిస్తూ, తిరిగి ఎన్నికలు జరపండి అని ఆదేశించడం పాఠకులకు విదితమే. అయితే తనకు ఏ పదవీ ఇవ్వనప్పటికీ, ‘నరేన్ కొడాలి’ ను ‘ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్’ గా అంగీకరిస్తూ ‘సెలక్షన్’ ప్రక్రియ తప్పనీ, అది ‘తానా’ కు దీర్ఘ కాలంలో చెడు జరుగుతుందనీ వాదిస్తూ, ఎన్నికలలోనే ఇటువంటి సర్దుబాటు చేసుకోవాలని అనేక మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. చివరికి ఆయన చెప్పినట్లే కోర్టు ద్వారా ఎన్నికలు తిరిగి వచ్చాయి. ఇప్పుడు అదే విషయమై ఎన్నికల్లో సర్దుబాటుపై ‘గోగినేని’ వ్యక్తిగతంగా కృషి చేసినప్పటికీ ‘సెలెక్షన్స్’ లో ‘నరేన్’ తో పాటు పదవులు పంచుకొన్న అనేకమంది ఇప్పుడు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అది మంచిది కాదని, ఇప్పటికే ఈ ఎన్నికలు చాలా లేటు అయినందున ఒక సంవత్సరం లోనే మళ్లీ ఎన్నికలు రానందున, ఇప్పటి ఎన్నికలు ఇంత ఉద్రిక్తంగా జరగడం వద్దని భావించడం కూడా తన నిర్ణయానికి మరొక కారణమంటున్నారు.
కాగా ‘శ్రీనివాస గోగినేని’ మరియు ‘నరేన్ కొడాలి’ ‘తానా’ లో అనేక సంవత్సరాలు కలిసి పనిచేశారు. ముఖ్యంగా ‘నరేన్’ బోర్డు చైర్మ గా ఉన్నప్పుడు, ఇంకా ‘గోగినేని’ ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ‘తానా’ బోర్డు లో చురుకుగా కలిసి పనిచేస్తూ పలువురి మన్ననలు అందుకున్నారు. అలాగే రెండు సార్లు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పటికీ, ఒక్క పరుషపదజాలం కూడా ఒకరిపై ఒకరు వాడుకోకపోవడము చాలామంది గమనిస్తూ ‘తానా ‘ అంటే పెద్దమనుషుల సంస్థ అనే ప్రఖ్యాతి ఈ ఇరువురూ మళ్ళీ తెస్తారని, సంస్థ ముఖ్య లక్ష్యాలైన తెలుగు భాషకు, సంస్కృతికీ అలాగే తెలుగు ప్రజలకు సేవ చేస్తూ, వర్గ రాజకీయాల నుంచి సేవా కార్యక్రమాల వైపు అందరి దృష్టీ మళ్లిస్తారని ఆశిస్తున్నారు.