దేవుడి స్క్రిప్టు అన్నంతనే.. ఉలిక్కిపడేవారు తెలుగుదేశం పార్టీ నేతలు. నాలుగేళ్ల క్రితం మే నెలలో వెలువడిన అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో.. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యే సీట్లు రావటం.. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన వేళలో.. విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవటాన్ని ప్రస్తావిస్తూ.. దేవుడి స్క్రిప్టు అంటూ వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి డైలాగ్ ఎంతలా పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అప్పటి నుంచి దాదాపు మూడున్నరేళ్ల పాటు దేవుడి స్క్రిప్టు మాటతో చంద్రబాబుఅండ్ కోను జగన్ అండ్ కోఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా? అన్న మాటకు తగ్గట్లే.. గడిచిన కొంతకాలంగా జగన్ అండ్ కోకు కొత్త సమస్య వచ్చి పడింది. తమ నోటి నుంచి ఏ దేవుడి స్క్రిప్టు అన్న మాట వచ్చిందో.. సరిగ్గా అలాంటిమాట అనిపించుకునే పరిస్థితి ఇప్పుడు తరచూ ఎదురవుతూ ఉంది.
మొదటిగా దేవుడి స్క్రిప్టు అన్న మాటను చంద్రబాబు ఆయన్ను అభిమానించే వారంతా ముక్తకంఠంతో ఈ డైలాగ్ తో జగన్ అండ్ కో మీద అటాక్ చేసిందిఈ మధ్యన వెల్లడైన ఎమ్మెల్సీ ఫలితాల వేళలోనే. 23 సీట్లు వచ్చాయని దేవుడి స్క్రిప్టు మాటతో ఎటకారం చేసిన జగన్ అండ్ కోకు.. చుక్కలు చూపించేలా వెల్లడైన ఎమ్మెల్సీ ఫలితాలు ‘‘23’’ తేదీన వెలువడిన వైనంతో పసుపు దళాలు విరుచుకుపడ్డాయి. తమను 23 సీట్ల పార్టీగా ఆట ఆడుకున్న వైసీపీ వర్గాలకు అదే 23 తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో చుక్కలు చూపించామంటూ సంబరాలు చేసుకున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఇటీవల చోటు చేసుకున్న మరో రెండు పరిణామాలు కూడా దేవుడి స్క్రిప్టు మాటను ప్రస్తావించే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. అందులో ఒకటి.. చంద్రబాబును ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ ఆడుకోవటం తెలిసిందే. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచావు కదా? అంటూ ఎక్కెసం చేయటం తెలిసిందే. ఇప్పుడు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో.. బాబాయ్ కు గొడ్డలి పోటు అంటూ జగన్ ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. నిన్నటికి నిన్న జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో అబ్బాయి బాబాయ్ ను చంపారు అంటూ పసుపు దళం విరుచుకుపడటం చూసినప్పుడు.. తాను అన్న మాటలనే తనకు తగిలినట్లుగా దేవుడి స్క్రిప్టు ఉందన్నమాట వినిపిస్తోంది.
ఇక.. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి తర్వాతి కాలంలో అప్రూవర్ గా మారిపోవటం తెలిసిందే. దీంతో.. అప్రూవర్ అయితే మాత్రం వదిలేస్తారా? అరెస్టు చేయరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగన్ అండ్ కోకు ఇప్పుడు కొత్త తిప్పలు ఎదురైందని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు అప్రూవర్ గా మారిపోయిన నేపథ్యంలో.. ఆయనకు బెయిల్ (ఇప్పటికే బెయిల్ మీద ఉన్నారనుకోండి) దక్కనుంది.
అదే సమయంలో ఆయన నోటి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా రానున్న రోజుల్లో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్లు తలెత్తే అవకాశం ఉంది. వివేకా కేసులో దస్తగిరి విషయంలో తాము చేసిన డిమాండ్ కు వ్యతిరేకంగా శరత్ చంద్రారెడ్డి ఇష్యూలో వాదనను వినిపించాల్సి ఉంటుంది.ఎందుకంటే.. శరత్ చంద్రారెడ్డి మరెవరో కాదు.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి అల్లుడి సొంత సోదరుడు. ఇదంతా చూస్తున్నప్పుడు.. అప్రయత్నంగా దేవుడి స్క్రిప్టు అన్న మాట నోటి నుంచి రాక మానదు.