మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల ముంగిట ఆశించిన బజ్ లేకపోయినా.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం, పోటీగా దసరా బరిలో నిలిచిన రెండు చిత్రాలు తేలిపోవడం బాగానే కలిసొచ్చింది. దసరా సెలవులను ఉన్నంతలో బాగానే ఉపయోగించుకుని వాంర రోజుల వ్యవధిలో వంద కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అలాగే షేర్ కూడా రూ.70 కోట్ల దాకా వచ్చింది. ఐతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ.20 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉందని, తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అవడంతో ఫుల్ రన్లో ఇది లాస్ వెంచర్ కాబోతోందని, ‘ఆచార్య’లా డిజాస్టర్ కాకపోయినా మరోసారి చిరు చిత్రానికి నిరాశాజనక ఫలితమే రాబోతోందని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐతే ఈ చర్చకు ‘గాడ్ ఫాదర్’ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
‘గాడ్ ఫాదర్’ను దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సొంతంగా రిలీజ్ చేశామని, వసూళ్ల పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నామని, బయ్యర్లు నష్టపోవడం అన్న మాటే లేదని ఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రూ.60 కోట్ల షేర్ రాబట్టిందని, యుఎస్‌లో 1.1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిందని ఆయన వెల్లడించారు. సినిమా మీద తాము పెట్టిన పెట్టుబడి కంటే రాబడి ఎక్కువే అని, కాబట్టి ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ పట్ల తాము పూర్తి సంతోషంగా ఉన్నామని ఎన్వీ ప్రసాద్ స్పష్టం చేశారు.
దీన్ని బట్టి రూ.90 కోట్ల షేర్ సాధిస్తేనే ‘గాడ్ ఫాదర్’ బ్రేక్ ఈవెన్ అవుతుందనే మాట నిజం కాదనే భావించాలి. సల్మాన్ ఖాన్ క్యామియో చేయడం వల్ల ఈ చిత్రానికి హిందీతో కలిపి శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ రేటే పలికాయి. వాటి ద్వారానే రూ.100 కోట్ల దాకా ఆదాయాన్ని నిర్మాతలు అందుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే థియేట్రికల్ రన్ ద్వారా 70-75 కోట్ల షేర్ వచ్చినా భారీగా లాభాలు దక్కినట్లే.