అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. కేంద్రప్రభుత్వాన్ని పదే పదే అడిగితే తప్ప ఎంతో కొంత విదల్చదు. కానీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని సహాయం అడగలేరు. వరద బాధితులను ఆదుకోరు. ఎగువన భారీ వర్షాలు కురిశాయి! గోదావరికి భారీ వరద రాబోతుందని ముందే కేంద్ర జలసంఘం హెచ్చరించింది. రాష్ట్రంలో ఊర్లకు ఊర్లనే వరద ముంచెత్తింది. ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. మంత్రులు, అధికారులు పత్తా లేరు.
సాయం చేసే నాథుడే లేడు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు వరద ప్రాంతాలకు బయల్దేరారు. టీడీపీ నేతలు, స్థానిక కార్యకర్తలు అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు అందించడం మొదలుపెట్టారు. సీఎం జగన్ హాయిగా తాడేపల్లిలో ముసుగుతన్ని పడుకున్నారు. చంద్రబాబు సమక్షంలో బాధితులు గోడు వినిపించుకోవడం.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అందిన సాయం గుర్తుచేసుకుంటుండడంతో జగన్ కళ్లు తెరిచారు.
తాడేపల్లి నుంచి బయటకొచ్చి.. విశాఖ వెళ్లి ఓ పథకానికి బటన్ నొక్కి.. తిరుగుప్రయాణంలో హెలిక్టాపర్లో గోదావరిలో ఏరియల్ సర్వే చేశారు. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నారు. వరద పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన.. ఉదారంగా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రెండోసారి వరదలు వచ్చినా.. నోరు తెరిచి సాయం కోరలేదు. నష్టాలపై నివేదికా పంపలేదు.
పొరుగునే ఉన్న తెలంగాణ… వరదల వల్ల రూ.1,400 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. మహారాష్ట్ర సర్కారు రూ.1,500 కోట్ల సాయం అడిగింది. తెలంగాణ, మహారాష్ట్రతో పోల్చితే గోదావరి వరదతో భారీగా నష్టపోయిన ఏపీ మాత్రం మౌన గీతం పాడుతోంది. ముఖ్యమంత్రికి కేంద్రాన్ని సాయం కోరే ధైర్యం కూడా లేదా? ఎందుకంత భయం?
ప్రాథమిక అంచనా ఏదీ?
గోదావరికి వరద పోటు మొదలై నెల దాటింది. సాధారణంగా… ముంపు సమయంలోనే వరద నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించాలి. బాధితులకు సహాయం అందించేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలి. విపత్తు నిధుల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రాన్ని కోరాలి.
ఈ సంవత్సరానికి అప్పటికే కేంద్రం నిధులు ఇచ్చేసి ఉంటే… అదనపు నిధులు అడగాలి. కానీ ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం కోరనే లేదు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి జిల్లాల పరిధిలో 82 గ్రామాలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లు, ఆస్తులు, నిత్యావసరాలు సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. జరిగిన నష్టంపై ఇప్పటిదాకా ప్రాథమిక అంచనా కూడా వేయలేదు. ‘‘ఏపీలో భయంకరమైన వరద వచ్చింది.
ఏపీ ముఖ్యమంత్రి నాయకత్వంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాం’’ అంటూ గొప్పలు చెప్పుకొంటూ కేంద్రానికి ఒక నివేదిక పంపించారు. అందులో… జరిగిన నష్టం, జరగాల్సిన సహాయం గురించి ప్రస్తావించనే లేదు. రాష్ట్రాలు పదేపదే కోరితేనే కేంద్రం స్పందించదు. మరి… అడగకుండానే సహాయం చేస్తుందా?
అసలు భయం ఇదే…
‘నాన్నా… వంద రూపాయలు ఇవ్వు’ అని అడగ్గానే… ఏ తండ్రీ జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చేయడు. ‘నిన్న ఇచ్చిన వంద ఏం చేశావు?’ అని అడుగుతాడు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో కేంద్రం కూడా ఇలాగే నిక్కచ్చిగా ఉంటుంది. ‘విపత్తు నిధులు ఇవ్వండి’ అని జగన్ అడిగితే… ‘గతంలో ఇచ్చిన సొమ్ములు ఏం చేశారు?’ అని కేంద్రం ప్రశ్నిస్తుంది.
అప్పుడు… జగన్ నోట సమాధానం ఉండదు. ఎందుకంటే… కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేసింది. మన రాషా్ట్రనికి 2022- 23లో కేంద్రం రూ.1,600 కోట్లు విపత్తు నిధులుగా కేటాయించింది. ఇందులో కేంద్రం 75 శాతం నిధులు ఇస్తుంది. మిగతా 25శాతం రాష్ట్రం తన వాటాగా కేటాయించి వినియోగించాలి. ముందు ఏడాది ఇచ్చిన నిధుల ఖర్చుపై ఆడిట్ రిపోర్టు (యుటిలైజేషన్ సర్టిఫికెట్) ఇస్తేనే… కేంద్రం తాజా నిధులను విడుదల చేస్తుంది. అసలు సమస్య ఇదే.
గతంలో విపత్తు నిధుల కింద వచ్చిన 1100 కోట్ల రూపాయలను రాష్ట్రం దారిమళ్లించింది. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనలను ఉల్లంఘించి ఇతర అవసరాలకు వాడుకుంది. ప్రస్తుతం ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఆ మొత్తాన్ని విపత్తు నిధిలో జమ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతమొత్తం ఎక్కడి నుంచి తేవాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
గోదావరి వ రదల వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో రూ.4వేల కోట్లపైనే నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఉద్యాన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 82 గ్రామాల పరిధిలో ప్రజలు ఆస్తులు కోల్పోయారు. 80 శాతం మేర ఇళ్లు దెబ్బతిన్నాయి.
ముందే హెచ్చరించినా…
గోదావరి వరద తీవ్రత గురించి కేంద్రం నుంచి ముందే హెచ్చరికలు వచ్చాయి. అయితే, రాష్ట్ర సర్కారు ముందస్తు చర్యలు వేగంగా తీసుకోలేకపోయింది. గత నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరిగింది. ప్రభుత్వ పెద్దలు ఆ సంబరాల్లో మునిగిపోయారు. 10వ తేదీ నాటికే గోదావరికి భారీ వరద వచ్చింది. అదే రోజున కేంద్ర జలశక్తి శాఖ, విపత్తు నిర్వహణ శాఖలు అలెర్ట్ మెసేజ్లు పంపించాయి.
వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని 12వ తేదీన హెచ్చరించాయి. కానీ జగన్ సర్కారు సీరియస్గా స్పందించలేదు. 14వ తేదీ నాటికి వరద పెరగడంతోపాటు అదే రోజున మరో అల్పపీడనం ఏర్పడింది. వర్షాలు దంచికొట్టాయి. దీంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆ మరుసటి రోజుకంతా గోదావరి తీరప్రాంతాలు నీటమునిగాయి. ఆ తర్వాతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారన్న విమర్శలు వచ్చాయి.