కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఎస్సార్ నగర్ లోని ఒక అపార్టుమెంట్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ను.. యువకుత్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణంగా డ్రగ్స్ ను తీసుకొచ్చింది వైసీపీ కి చెందిన ఒక నేత కొడుకు పుట్టిన రోజు పార్టీ కోసమే తెచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న టీఎస్ న్యాబ్ పోలీసులు.. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎక్సటసీ పిల్స్ తో పాటు.. వైసీపీ నేత కొడుకు పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలోనూ డ్రగ్స్ ను వినియోగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు ఆశిక్ యాదవ్.. రాజేష్ లు గోవాకు చెందిన బాబా అనే వ్యక్తి వద్ద అరవై ఎక్సటసీ పిల్స్ ను కొన్నట్లుగా గుర్తించారు.
అంతేకాదు.. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత కొడుకు పుట్టిన రోజు పార్టీలోనూ డ్రగ్స్ ను వినియోగించిన వైనాన్ని గుర్తించారు. గోవాకు వెళ్లిన టీఎస్ న్యాబ్ పోలీసులు.. అక్కడ బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం నాలుగురోజుల పాటు ఓపిగ్గా వెయిట్ చేసి.. వలపన్ని అతన్ని అరెస్టు చేశారు. బాబా అసలు పేరు హనుమంత్ బాబూ సో దివ్కర్ గా గుర్తించారు. అతడికి యాభై ఏళ్లు. అతడి వ్యాపారమే డ్రగ్స్ గా చెబుతున్నారు.
ఒక్కో ఎక్సటసీ పిల్ ను వెయ్యి రూపాయిల నుంచి రూ.1200 వరకు అమ్ముతారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు..ఇతడికి హైదరాబాద్ లో ఉన్న కస్టమర్ల బేస్ ను గుర్తించారు. దాదాపు పాతిక మంది వరకు అతడి వద్ద డ్రగ్స్ ను తరచూ కొనుగోలు చేస్తారని గుర్తించారు. ఇందులో భాగంగా ఫిలింనగర్ లోని శాంచురీ పబ్ డీజే ఆపరేటర్ గా పని చేసే స్వదీప్ కూడా ఒక కస్టమర్ గా తేల్చారు. ఇతడు బాబా దగ్గర 14 గ్రాముల కొకైన్ ను రూ.1.4 లక్షలు ఇచ్చినట్లుగా తేల్చారు.
వైసీపీ నేత కొడుకు పుట్టిన రోజుసందర్భంగా నిర్వహించిన రేవ్ పార్టీలో నెల్లూరుజిల్లాకు చెందినపలువురితో పాటు హైదరాబాద్ కు చెందిన ఇంకొందరు హాజరయ్యారని.. మొత్తం 33 మందిగా తేల్చారు. వారిలో 12 మందిని గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు.ఇక.. పోలీసులు అదుపులోకి తీసుకున్న ముగ్గురికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో వారు ముగ్గురు డ్రగ్స్ ను వినియోగిస్తున్నారన్న విషయాన్ని గుర్తించినట్లుగా పోలీసుల వర్గాలు చెబుతున్నాయి.