ఓ పక్క పేకాట…మరో పక్క క్యాసినో….ఇంకో పక్క చీర్ గాల్స్ చిందులు…మరోపక్క…తాగినంత మందు….సాధారణంగా ఇటువంటి సీన్లన్నీ ఏ సినిమాల్లోనో…లేదంలో గోవాలోనో కనిపిస్తుంటాయి. కానీ, ఈ సారి సంక్రాంతి సందర్భంగా ఏపీలోని గుడివాడలో వాటిని తలదన్నేలా ఏర్పాటు చేసిన క్లబ్బు కమ్ పబ్బును చూస్తే గోవా జనమైనా ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. ఇక, ఈ గోవా కల్చర్ ను మన గుడివాడ ప్రజలకు పరిచయం చేసిన ఘనత వైసీపీ కీలక నేత గడ్డం గ్యాంగ్ కే దక్కుతుంది.
గుడివాడలో సంక్రాంతి పండుగనాడు మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాల్ ఓ మినీ గోవాగా మారిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫంక్షన్ హాల్లో జూదరుల కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే కళ్లు చెదరాల్సిందే. సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా కోడి పందేలు, పేకాట శిబిరాలు, ప్రత్యేకంగా క్యాసినోలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక, క్యాసినో కమ్ పేకాట క్లబ్ లో ఎంట్రీకి రూ.10 వేల ఫీజు పెట్టారు. 10 వేలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి ఉంటుంది.
పదివేలకు తగ్గట్లు లోపల గోవాను తలపించేలా ఏర్పాట్లు చేశారు. ఓ పక్క జూదరులంతా పేకాట, తీన్పత్తి, అందర్ బాహర్ అంటూ మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు. మరోపక్క, క్యాసినోలో కాయిన్స్ తో మరికొందరు జూదరులు అఫీషియల్ గా బోర్డు మీద గేమ్ ఆడుతున్నారు. ఇక, జూదరులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యేకంగా లైటింగ్ తో డెకరేట్ చేసిన స్టేజ్, ఆ స్టేజీపై అందమైన యువతులు చిట్టి పొట్టి బట్టలేసుకొని చిందులు వేస్తున్నారు.
ఐటమ్ సాంగ్స్ తో అక్కడి జూదరులకు, మందుబాబులకు కిక్కిచ్చేలా స్టెప్పులేస్తున్నారు. ఈ వ్యవహారమంతా బయటకు పొక్కుతుందేమోనని క్యాసినో లోపల సెల్ఫోన్లతో వీడియోలు తీయకుండా బౌన్సర్లు నిఘా పెట్టారు. సంక్రాంతా నాడు మన ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి తగ్గేదేలే అంటూ మందేసి చిందేశారు వైసీపీ నేతలు. అయితే, ఎలాగోలా దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో అది కాస్తా వైరల్ అయింది.