ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. తీరికలేనంత బిజీగా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కావటంతో పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ అయ్యారు. వైట్ హౌస్ వెళ్లేందుకు మోడీ వాషింగ్టన్ డీసీకి చేరుకునే సమయానికి వర్షం పడుతున్నప్పటికీ ఇండో అమెరికన్లు ఆయన కోసం వేచి చూసి స్వాగతం పలికిన తీరు అందరిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విటర్ లో తన పర్యాటనకు సంబంధించిన తాజా అప్డేట్ పోస్టు చేస్తూ.. ‘వాషింగ్టన్ డీసీ చేరుకున్నా. భారతీయుల ఆత్మీయ స్వాగతం.. ఇంద్రుడి ఆశీర్వాదం (చిరు జల్లులతోకురుస్తున్న వర్షాన్ని ప్రస్తావిస్తూ) దీనిని మరింత ప్రత్యేకంగా మార్చాయి’ అంటూ ట్వీట్ చేశారు. వైట్ హౌస్ చేరుకున్న మోడీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. ఆయన సతీమణి జిల్ బైడెన్ లు సాదర స్వాగతాన్ని పలికారు. సరదాగా పలు అంశాల్ని చర్చించారు. సరదా కబుర్ల మొదలుప్రపంచ అంశాల మీదా వారి సంభాషణ సాగినట్లు చెబతున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా పర్యటనలో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆయన సతీమణి పలు ప్రత్యేక బహుమతుల్ని ఇచ్చారు.
20వ శతాబ్దం ఆరంభంలో చేతితో తయారుచేసి గ్యాలీ అనే పుస్తకాన్ని ఇచ్చారు. దీని ప్రత్యేకత ఏమంటే.. దీన్ని పూర్తిగా చేతిలో తయారు చేశారు. తొలి కొడాక్ కెమెరా కోసం జార్జ్ ఈస్ట్ మన్ కు జారీ చేసిన పేటెంట్ ఆర్కైవల్ కాపీ.. అమెరికా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్ బుక్ ను బహుకరించారు. అధ్యక్షుల వారి సతీమణి జిల్ బైడెన్ ప్రముఖ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సైన్డ్ కాపీని అందించారు. సాధారణంగా విదేశీ పర్యటనలు చేసే సందర్భంగా వివిధ దేశాధినేతలకు అరుదైన బహుమతుల్ని ప్రధాని మోడీ ఇవ్వటం తెలిసిందే. తాజా టూర్ లో బైడెన్ ఇస్తున్నబహుమతులు హైలెట్ అయ్యాయి.
తాను తీసుకున్న బహుమతులకు ప్రతిగా ప్రధాని మోడీ కూడా బైడెన్ దంపతులకు పలు గిఫ్టులు ఇచ్చారు. భారత్ తో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత.. నోబెల్ విజేత డబ్ల్యూబీ యేట్స్ రాసిన భారత ఉపనిషత్తుల ట్రాన్స్ లేట్ కాపీని బైడెన్ కు బహుమతిగా ఇచ్చారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ వజ్రం పర్యావరణానికి అనుకూలమైనదని.. సోలార్.. విండ్ పవర్ లాంటి వనరులతో దీన్ని రూపొందించినట్లు చెబుతున్నారు.