అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. అధికార.. ప్రతిపక్షపార్టీల టికెట్ల పంచాయితీలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ టికెట్ పంచాయితీ తాజాగా హైదరాబాద్ కు చేరటం ఆసక్తికరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేదే లేదంటూ తేల్చేయటం కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారింది.
తన కొడుక్కి టికెట్ ప్రయత్నాలు చేసిన ఆయన.. అవేవీ సానుకూల ఫలితాలు ఇవ్వకపోవటంతో.. అలకబూనిన ఆయన పోటీ రేసు నుంచి పక్కకు తప్పుకున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా అనుహ్య ట్విస్టు చోటు చేసుకుంది. ‘అన్నా రాంబాబు’ మనసు మార్చుకొని.. మళ్లీ పోటీ దిశగా పావులు కదుపుతున్నట్లుగా చెప్పాలి. ఇందులో భాగంగా ఆయన్ను మద్దతు ఇచ్చే పలువురు తాజాగా హైదరాబాద్ చేరుకొని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో కలిశారు.
అన్నాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు అన్నా రాంబాబు పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో పలువురు ఆ సీటు మీద కన్నేశారు. అందుకు తగ్గట్లు ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి.
ఇలాంటివేళలో అన్నా వర్గీయులు మాజీ మంత్రి బాలినేనిని కలిసి.. గిద్దలూరు టికెట్ అన్నాకే కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి పేరును గిద్దలూరి వైసీపీ అభ్యర్థిగా పరిశీలించే అవకాశాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతున్న పరిస్థితి.
ఇలాంటివేళ.. బాలినేని వద్దకు వెళ్లి తమ నేత అన్నా రాంబాబుకు టికెట్ కన్ఫర్మ్ చేయాలని కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. దీనిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. నిన్నటి దాకా అస్త్రసన్యాసం చేసిన అన్నా రాంబాబు.. ఇప్పుడు ఎన్నికల గోదాలోకి దిగేందుకు రెఢీ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.