ప్రతి ఎన్నికలోను వాళ్ళు షాక్ ఇచ్చారు, వీళ్ళు షాకిచ్చారని అనుకోవటం మామూలే . కానీ తాజాగా ముగిసిన గ్రేటర్ పోలింగ్ లో రాజకీయపార్టీలకు ఏకంగా ఓటర్లే షాక్ ఇచ్చారు. మొత్తానికి పోలింగ్ శాతం 45 అని అధికారికంగా తేల్చేశారు. గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఎక్కువ జరుగుతుందని ఆశించారు. అప్పటికీ 45 శాతం పోలింగ్ జరిగిందంటే నాట్ బ్యాడ్ అని చెప్పుకోవాల్సిందే. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు, అభ్యర్ధుల్లో కనిపించిన ఊపు ఓటర్లలో మాత్రం కనబడలేదన్నది వాస్తవం.
హోరా హోరీగా సాగిన ప్రచారం తర్వాత కూడా పోలింగ్ శాతం ఇంత తక్కువగా జరగటానికి కారణాలు ఏమిటి ? నిజానికి 2015, 2009లో కూడా ఇంతకన్నా మెరుగ్గా ఏమీ పోలింగ్ నమోదు కాలేదు. ఎప్పుడూ గ్రేటర్ పోలింగ్ ఇలాగే ఉంటోందని లెక్కలు చెబుతున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువగా జరిగితే అధికారపార్టీకే నష్టమనే అంచనా ఒకటుంది మన దగ్గర. మరి పోలింగ్ శాతం తక్కువగా జరిగితే ఎవరికి నష్టం ? అన్నదే పెద్దద పజిల్ గా మారిపోయింది.
పార్టీల విశ్లేషణలను బట్టి లో పోలింగ్ వల్ల ప్రతిపక్షాలకే పెద్ద నష్టమని అనుకుంటున్నారు. అధికారపార్టీకి ఎలాగూ మేయర్ పీఠం రిజర్వు అయిపోయింది. ఎక్స్ అఫీషియో ఓట్ల ఆధారంగా గ్రేటర్ మేయర్ పీఠం దాదాపు టీఆర్ఎస్ కే అన్నదానిలో సందేహం లేదు. కాకపోతే ఎన్ని డివిజన్లు గెలుస్తుందన్నదే సస్పెన్సుగా మారింది. మొన్నటి కార్పొరేషన్లో అధికారపార్టీకి 99 డివిజన్లున్నాయి. వీటిలో ఎన్ని తగ్గితే టీఆర్ఎస్ పై జనాల్లో అంత వ్యతిరేకత పెరుగుతోందనేందుకు ఓ అంచనా ఉంటుంది. లో పోలింగ్ అయినా దానికి వచ్చే డివిజన్లలో పెద్దగా మార్పు లేకపోతే వ్యతిరేకత అని చెప్పటానికి కూడా కష్టమే.
ఇక ఎంఐఎంకు కూడా పెద్ద నష్టం జరగదనే అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి కార్పొరేషన్లో ఎంఐఎంకు 40 ఉన్నాయి. ఈసారి పెద్దగా మైనస్ అయ్యే అవకాశాలు తక్కువనే అంటున్నారు. చివరగా ఏదైనా నష్టం అంటు జరిగితే అది కమలంపార్టీకే అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్ని డివిజన్లలో గెలుస్తుందనే అచంనాలు లేకపోయినా గ్రేటర్ పీఠాన్ని ఎగరేసుకుపోయినంతగా హడావుడి చేసేసింది. బీజేపీ నేతలు, అగ్రనేతల ప్రచారం తదితరాల వల్ల జనాల్లో కమలంపార్టీ అంటే ఓ హైప్ వచ్చేసింది. తీరా పోలింగ్ చూస్తే కనాకష్టంగా ఉంది.
అంటే బీజేపీకి పడతాయని అనుకున్న ఓట్లలోనే ఎక్కువ మైనస్ అయ్యాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. మొన్నటి కార్పొరేషన్లో బీజేపీకి 4 డివిజన్లున్నాయి. ఇఫుడు ఐదుకి పెరిగినా బీజేపి లాభమే. కానీ పెరిగి ఒకటి రెండు డివిజన్లు కాదు కదా ఆ పార్టీ కోరుకున్నది. కాబట్టి అత్యంత తక్కువ పోలింగ్ వల్ల నష్టం ఎక్కువగా బీజేపీకే అనిపిస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుగా ఉంది వ్యవహారం. కాబట్టి పోలింగ్ పెరిగినా, తగ్గినా ఈ పార్టీలకు పెద్దగా ఒరిగేదేమీ లేదనే చెప్పాలి.