ఒక పార్టీ కోసం కార్యకర్తలు చిత్తశుద్ధితో పని చేయాలంటే వాళ్లకు ‘అధికార’ బలం అత్యవసరం. పార్టీ నుంచి కొందరైనా ప్రజా ప్రతినిధులు ఉంటే ఆర్థికంగానే కాక అన్ని రకాలుగా అండదండలు ఉంటాయి. అలాంటి సపోర్ట్ లేకుంటే పార్టీల మనుగడ చాలా కష్టమవుతుంది. ఆరేళ్ల కిందట మొదలైన జనసేన పార్టీకి ఈ బలమే కరవైంది. 2014 ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడం మద్దతుదారులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
గత ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించేలా వచ్చాయి. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే యుటర్న్ తీసుకున్నాడు. అధికార పార్టీతో కలిసిపోయాడు. ఉప ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేసే సంకేతాలు కనిపించలేదు. ఐతే లేక లేక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బరిలోకి నిలవబోతోందంటే తెలంగాణలోని జనసే కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది.
ఓట్లు ఏ మేర పడతాయన్నది పక్కన పెడితే పవన్‌కు అభిమాన గణం అయితే తక్కువగా ఏమీ లేదు. ఐతే ఇక్కడ జనసేన ఎన్నికల బరిలో ఉండదు అని ముందే సంకేతాలు ఇస్తే కార్యకర్తలు, అభిమానులు సైలెంటుగా ఉండేవాళ్లు. కానీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి.. ఇప్పుడు యుటర్న్ తీసుకోవడం పవన్ వీరాభిమానులకు కూడా నచ్చట్లేదు.
రకరకాల కారణాల వల్ల బీజేపీ మీద జనసైనికులు కోపంగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మనం పోటీ చేయట్లేదు.. బీజేపీకి మద్దతివ్వండి అని పవన్ చేసిన ప్రకటన వారికి ఎంతమాత్రం రుచించట్లేదు. అసలు పోటీలో లేం అని సైలెంటుగా ఉంటే వ్యవహారం వేరుగా ఉండేది. కానీ ఆశలు రేకెత్తించి విరమించడం తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. జనసైనికులు పవన్ నిర్ణయాన్ని సమర్థించలేక, విమర్శించలేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
సోషల్ మీడియాలో ఇంతకాలం జనసేనకు మద్దతుగా నిలిచిన వాళ్లు కూడా తమ ఆగ్రహాన్ని చూపిస్తుండటం గమనించవచ్చు. ఇప్పటికే పవన్ గ్రాఫ్ బాగా తక్కువగా ఉండగా.. తాజా పరిణామంతో అది మరింత కిందికి పడిందనడంలో సందేహం లేదు.