తెలంగాణాలో రోజు రోజుకి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల పై తీవ్ర ప్రభావం చూపనుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఓటమి చెందితే మాత్రం సినిమా మరోలా ఉంటది. ఇన్ని రోజులు ప్రగతి భవన్ కు లేకపోతే మరో చోట మాత్రమే ఉన్న సిఎం కేసీఆర్ కచ్చితంగా ప్రజల్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ని రోజులు విపక్షాలను నానా మాటలు అన్న కేసీఆర్ ఇప్పుడు విపక్షాలతో మర్యాదతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. సిఎంగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజలతో, అధికారులతో మాట్లాడింది చాలా తక్కువ అనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత సినిమా మారింది. వద్దు అని నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులకి పార్టీ అధ్యక్షుడి నుంచి ఆహ్వానాలు వెళ్తున్నాయి.
ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి ఎలా అయినా సరే విజయం సాధించాలి అని పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి నేతలు తెరాస నేతలకు గాలం వేస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి సహా, ఎల్బీ నగర్, జూబ్లీ హిల్స్ వంటి అనేక నియోజకవర్గాల్లో ఉన్న నేతలకు గాలం వేస్తున్నారు. తెరాసలో పదవులు రాని నేతలను, ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని నేతలని తమ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బండి రమేష్, మువ్వా సత్యనారాయణ వంటి నేతలతో నేరుగా కిషన్ రెడ్డి మాట్లాడారని అంటున్నారు. అలాగే కూకట్ పల్లి నియోజకవర్గంలో మందాడి శ్రీనివాసరావుతో కూడా బిజెపి నాయకులు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. బిజెపి ముఖ్యంగా సెటిలర్స్ ఓట్లే టార్గెట్ గా నాయకులని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సనత్ నగర్ నియోజకవర్గంలో నలుగురు నేతలతో చర్చలు జరిపారు. కొంతమంది ఎమ్మెల్యేలతో బిజెపి చర్చలు జరిపినా, అనర్హత భయం వెంటాడుతుండటంతో వారు ముందు అడుగు వేయడం లేదు. కాని త్వరలోనే పది మంది నేతలకు, అంటే గ్రేటర్ ఎన్నికలలోపే పది మంది నేతలకు బిజెపి కాషాయ కండువా కప్పే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసుకున్న మాజీ టిడిపి నాయకులని కూడా బిజెపిలోకి తీసుకెళ్లే పనిలో బిజెపి ఉంది. దేవేందర్ గౌడ్ కుటుంబం ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు దేవేందర్ గౌడ్ అనుచరులుగా పేరుపొందిన నాయకులంతా బిజెపి నేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికలు అధికార తెరాసకి చుక్కలు చూపిస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు.