ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం రేపు జరగనున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేవలం ఒక్కరోజుపాటే శాసనసభ నడపాలని నిర్ణయించారు. అయితే, బడ్జెట్ పై పూర్తిస్థాయి చర్చ జరగడం లేదని, కాబట్టి ఆ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని టీడీపీ ప్రకటించింది. మరోవైపు, రేపటి బడ్జెట్ ను సరికొత్త విధానంలో ప్రవేశపెట్టబోతుండడం విశేషం.
ఏపీలో తొలిసారిగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను పరిచయం చేయబోతోంది ప్రభుత్వం. పిల్లలు, మహిళలు…ఇలా ఎవరికి ఎంత కేటాయింపులు చేశామో తెలియజెప్పేలా ఈ జెండర్ బేస్డ్ బడ్జెట్ రూపొందింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న జెండర్ బేస్డ్ బడ్జెట్ లో 18ఏళ్లలోపు పిల్లలు, మహిళలు, బాలికల సంక్షేమ పథకాలు, కేటాయింపులను కూడా విడిగా చూపించనున్నారు. ఈ ప్రకారమే ఇప్పటికే ప్రతిపాదనలనూ ఏపీ సర్కార్ స్వీకరించింది.
జెండర్ బేస్డ్ బడ్జెట్ అనేది జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ పేరుతో ప్రపంచమంతా పాపులర్ అయింది. లింగ అసమానతలు లేకుండా కేటాయించిన నిధులు వారికే నేరుగా చేరడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. విద్య, వైద్యం, రక్షణ, పిల్లల్లో న్యూట్రిషన్ పెరుగుదలకు ఈ టైప్ బడ్జెట్ దోహదపడుతుందన్నది నిపుణుల వాదన. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, కేరళ, అసోం, బీహార్, ఛత్తీస్గడ్, త్రిపుర, నాగలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు జెండర్ బేస్డ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు అదే బాటలో ఏపీ నడుస్తోంది.
రేపు ఉదయం 9గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్ పద్దతిలో ప్రసంగించి సభను ప్రారంభించనున్నారు. అనంతరం 2021-22 ఆర్ధిక సంవత్సరానికి మిగిలి ఉన్న 9 నెలల కాలానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెడతారు. ఇప్పటికే 3 నెలల కాలానికి 70వేల 983.11 కోట్ల అంచనాతో ఓటాన్ అకౌంట్‌ను అర్డినెన్స్ రూపంలో ఆమోదించిన సంగతి తెలిసిందే.