తమిళ కథానాయకుడు ధనుష్ కొంచెం లేటుగా అయినా తెలుగులో ఓ మోస్తరుగా ఫాలోయింగ్ సంపాదించాడు. రఘువరన్ బీటెక్ అప్పట్లో ఇక్కడ సూపర్ హిట్టయి ధనుష్‌కు మంచి ఆదరణ తెచ్చిపెట్టింది. కానీ ధనుష్ తర్వాతి చిత్రాల విషయంలో సరైన ప్లానింగ్ లేక, అలాగే అతడి సినిమాల్లోనూ దమ్ము లేక ఆ ఫాలోయింగ్ దెబ్బ తింది. ఇటీవల అతను తిరు అనే మంచి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ దీన్ని తెలుగులో సరిగా ప్రమోట్ చేయకపోవడం మైనస్ అయింది.
ముందు నుంచి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లి ఉంటే కథ వేరుగా ఉండేదేమో. ఐతే ధనుష్ తర్వాతి చిత్రం విషయంలో ఈ తప్పు చేయట్లేదు. పేరున్న సంస్థకు సినిమాను అప్పగించి.. గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లానింగ్ పూర్తయింది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్ ద్వారా ధనుష్ కొత్త చిత్రం నానే వరువాన్ రిలీజ్ కాబోతోంది. ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నేనే వస్తున్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత కలైపులి థాను.. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ను కలిసి ఈ సినిమాను తెలుగులో ఆయన బేనర్ ద్వారా రిలీజ్ చేయబోతున్న విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల చివరి వారంలో తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కావట్లేదు. మణిరత్నం సినిమా పొన్నియన్ సెల్వన్‌తో పాటు మరో తమిళ అనువాదం అయిన నేనే వస్తున్నానే రిలీజ్ కాబోతోంది. గీతా ద్వారా రిలీజ్ అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది. ప్రమోషన్లు కూడా బాగా జరుగుతాయి. సినిమాలో కంటెంట్ ఉంటే మంచి ఫలితం అందుకోవడం ఖాయం.