2020లో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనను ఏపీ ప్రజలు అంత ఈజీగా మరచిపోలేరు. వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకై 15 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. ఆ విషవాయువు ధాటికి ఊపిరి అందక జనాలు రోడ్లపైనే కుప్పకూలిపోవడం..కళ్లెదుటే తమ వారిని బంధువులు కోల్పోవడం వంటి ఘటనలు కలచివేశాయి. ఆ ఘటనలో మృతులకు ప్రభుత్వం భారీ నష్టపరిహారం ప్రకటించినా…పోయిన ప్రాణాలకు వెలకట్టలేకపోయింది.
ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వాధికారుల తనిఖీలలో అలసత్వం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. సరే, అదేదో పొరపాటున జరిగింది అని జనం వదిలేశారు. అయితే, తాజాగా ఈ ఏడాది జూన్ 3న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న సీడ్స్ దుస్తుల కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. దీంతో, సీడ్స్ దుస్తుల కంపెనీ దాని సమీపంలోని పోరస్ లాబ్స్‌ను దాదాపు వారం రోజుల పాటు మూసివేసి ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరిపింది.
పోరస్ ల్యాబరేటరీ నుంచి గ్యాస్ విడుదలైందని చెప్పడంతో చాలామంది కొంతకాలంగా సీడ్స్ కంపెనీలో విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సీడ్స్ దుస్తుల తయారీ కంపెనీ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడం సంచలనం రేపింది. ఆ ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీతో దాదాపు 150మందికి పైగా మహిళా ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వికారంతో స్పృహకోల్పోగా.. పరిశ్రమ ప్రాంగణంలోనే కొందరికి ప్రథమ చికిత్స అందజేశారు.
మరి కొందరిని బస్సులు, కార్లు, అంబులెన్సుల్లో హుటాహుటిన అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయానికి దాదాపు 4వేల మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండగా వారిలో 150 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్‌లో రెండోసారి విషవాయువు లీకేజీ జరగడంపై అధికారులు సమగ్ర పరిశీలన చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదేశించారు.
అయితే, ఈ ఘటనపై బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి దొరస్వామి స్పందించారు. ఈ గ్యాస్ లీకేజ్ ప్రమాదమా? కావాలనే ఎవరైనా విషవాయువులను విడుదల చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోందన్నారు. జూన్ 3 నాటి ఘటనతో అప్రమత్తమై సీడ్స్ కంపెనీతో పాటు బ్రాండిక్స్ ఇతర యూనిట్లలో ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సీడ్స్‌లో తాజాగా విడుదలైన గ్యాస్‌ని ఆధునిక వ్యవస్థ గుర్తించకపోవడం విచిత్రంగా ఉందని చెప్పారు. అయితే, ప్రభుత్వ అలసత్వంతోనే అధికారులు సరైన నివేదికలు ఇవ్వలేదని, అందుకే గ్యాస్ లీకైందని ఆరోపణలు వస్తున్నాయి.