హైదరాబాదులో నేడు జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్న సంగతి తెలిసిందే. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన తనయురాలు బండారు విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవి కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా చిరు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రక్తం అమ్ముకున్నారని కొందరు విమర్శలు చేశారని, అయినా తాను సంయమనం పాటించానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
1980లలో అభిమానం పేరుతో జరిగే కొన్ని పనులు తనకు నచ్చేవి కావని చెప్పుకొచ్చారు. అందుకే తాను ఆ విష సంస్కృతిని మార్చాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే తన సినిమా హిట్ అయితే తోటి హీరోలను పిలిచి పార్టీ ఇచ్చేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇదేరకంగా పార్టీలకతీతంగా బండారు దత్తాత్రేయ గత 17 సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఆయన వారసత్వాన్ని విజయలక్ష్మి కొనసాగిస్తున్నారని చిరు ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అయితే, తనపై ప్రశంసలు కురిపించిన చిరంజీవిపై గరికపాటి నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తుండగా చిరంజీవితో ఫోటోలు దిగేందుకు కొందరు యువతీయువకులు వేదిక మీదకు వచ్చారు.
దీంతో, వారితో ఫోటోలు దిగుతున్న సందర్భంగా చిరంజీవిపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు ఆ ఫోటో సెషన్ ఆపి ఇటు వస్తేనే తాను ప్రసంగం కొనసాగిస్తానని లేదంటే తనకు సెలవు ఇప్పించాలని గరికపాటి షాకింగ్ కామెంట్ చేశారు. తనకు మొహమాటం లేదని, అక్కడి నుంచి వెళ్ళిపోతానని గరికపాటి మరింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో చిరంజీవి ఆ ఫోటో సెషన్ ఆపి వేదికపైకి వచ్చి గరికపాటి పక్కన కూర్చున్నారు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై మెగా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గరికపాటి ఆవేదనను అర్థం చేసుకున్న చిరు హుందాగా ప్రవర్తించి మారు మాట్లాడకుండా వచ్చి కూర్చున్నారని తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచేస్తున్నారు.