తెలుగు మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇంట కొద్ది రోజుల క్రితం శుభకార్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా దంపతుల రెండో కుమార్తె బృహతి, వెంకట్ అక్షయ్ ల వివాహ వేడుక రామోజీ ఫిల్మ్‌సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ లతోపాటు రాజకీయ, సినీ, వ్యాపార, మీడియా ప్రముఖులను ఆహ్వానించారు రామోజీరావు.
ఈ వివాహ మహోత్సవానికి హాజరైన రాజకీయ, వ్యాపార, న్యాయ, సినీ, మీడియా ప్రముఖుల గురించి తన పత్రికలో వివరంగా రాసుకొచ్చారు కూడా. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలెవరూ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ, ఈ పెళ్లి వేడుకలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుకు సన్నిహితులుగా పేరున్న రామోజీరావు ఇంట పెళ్లికి చంద్రబాబుకు ఆప్తుడు, తోటి మీడియా సంస్థ యజమాని అయిన ఆర్కే రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
సీవీఆర్ చానల్ అధినేత సీవీ రావు, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్, మలయాళ మనోరమ నుంచి జాకబ్ మాథ్యూస్, రాజస్థాన్ పత్రిక నుంచి సిద్ధార్థ్ కొఠారి వంటి మీడియా ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాగా..ఆర్కే హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది. దానికితోడు ఆంధ్రజ్యోతి పత్రికలో రామోజీరావు మనవరాలి పెళ్లి వార్త కనిపించలేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రామోజీ రావు, రాధాకృష్ణల మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా, వ్యాపారపరంగా విభేదాలున్నా, శుభ, అశుభ కార్యాల్లో పాల్గొనడం సంప్రదాయమన్న టాక్ సోషల్ మీడియాలో వస్తోంది. అయితే, ఆర్కే బిజీగా ఉండి ఆ వివాహ వేడుకకు హాజరు కాలేదా…లేక ఆ వివాహానికి రామోజీరావు పిలవకపోవడం వల్లే వెళ్లలేదా అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. పెళ్లికి పిలవనంత విభేదాలు వాళ్ల మధ్య ఏముంటాయన్న చర్చ కూడా నెటిజన్ల మధ్య జోరుగా జరుగుతోంది.