ఏపీ సీఎం జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి ఆయనపై ఒక అపప్రద ఉంది. విక్రమార్కుడు బ్రహ్మానందం సగం గుండు కొట్టి అర్ధాంతరంగా వదిలేసి వెళ్లినట్లు…జగన్ కూడా ఎక్కువగా శంకుస్థాపనలు తక్కువగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ కు జగన్ శంకుస్థాపన చేయడంపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, అందుకే జగన్ హడావిడిగా మరో కొబ్బరికాయ కొట్టేశారని విమర్శలు వస్తున్నాయి. కొబ్బరికాయ కొట్టడమే తప్ప గుమ్మడి కాయ కొట్టిన దాఖలాలు లేవని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. నాలుగున్నరేళ్లలో శంకుస్థాపనలే తప్ప ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా? జగన్మోహన్ రెడ్డిగారూ…అని ఆయన ప్రశ్నించారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వైసీపీ ప్రభుత్వంపై గంటా…గంటకొట్టినట్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆఖరికి చంద్రబాబు శంకుస్థాపన చేసి… ప్రాజెక్టు పనులు ప్రారంభించిన వాటికి కూడా మీరు రెండోసారి శంకుస్థాపన పేరుతో హడావుడి చేశారని, ఆ రోజు తెచ్చిన పలుగు, పార, తట్ట కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయారని గంటా ఎద్దేవా చేశారు. జగన్ కు చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క చిన్న ప్రాజెక్టైనా పూర్తి చేసి ప్రారంభించామని చూపించగలరా అని నిలదీశారు.
‘ఎప్పుడూ శంకుస్థాపనలే కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క ప్రారంభోత్సవమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు….?
ఈ నాలుగున్నారేళ్లలో కొత్తగా వచ్చిన కంపెనీ ఒక్కటీ లేదు…
ఒప్పందం చేసుకున్న కంపెనీలు రివర్స్ పాలనతో పక్క రాష్ట్రాలకి వలస వెళ్లి పోయాయ్..
ఇక ఉద్యోగాలేమొస్తాయ్ …
ఆదాయం ఏం వస్తుంది…..
అయినా ఏముందిలే అప్పులు చేసి బ్రతికేయగలరూ కదా…!
మీరు ముఖ్యమంత్రి అయ్యాక అప్పు చెయ్యని నెల.. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీలు తాకట్టు పెట్టని మంగళవారం ఒకటి కూడా లేదు కదా..!
ఎన్నికలు సమీపిస్తుండటంతో చివరి సంవత్సరంలో హడావుడిగా నిన్న విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన దగ్గర నుంచి చూస్తే…
ఈ సంవత్సరం మే 3న భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన….
ఇదే సంవత్సరం మే 22న మచిలీపట్నం పోర్టు కు శంకుస్థాపన….
ఇదే సంవత్సరం ఫిబ్రవరి 15న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన…..
గత సంవత్సరం జులై 20న రామాయపట్నం పోర్టు కు శంకుస్థాపన….
ఇలా ప్రతి కార్యక్రమం కూడా శంకుస్థాపన పేరిట ప్రజలను మభ్యపెడుతూ వారిని మోసం చేస్తూనే ఉన్నారు’ అని గంటా చేసిన ట్వీట్ వైరల్ అయింది.