ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకీ దొడ్ల పర్యవేక్షణ దగ్గరనుంచి మద్యం దుకాణాల వద్ద విధుల నిర్వహణ వరకు గురువులను అన్ని రకాలుగా అవమానించిన ప్రభుత్వం ఇది అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయినా, సరే తీరు మారని వైసీపీ నేతలు మాత్రం ఉపాధ్యాయులను చులకన చేసే పనులే కాదు వ్యాఖ్యలు చేయడం కూడా మానుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను గౌరవించాల్సిన మాజీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వారిని తీవ్రంగా అవమానించే వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.
గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ సురేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గురువుల కన్నా గూగుల్ లో ఎక్కువ మెటీరియల్ లభిస్తుందని సురేష్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.ఆ వ్యాఖ్యలను పలువురు ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. బైజూస్ ట్యాబుల్లో మెటీరియల్ అందుబాటులో ఉందని ఉపాధ్యాయులకు తెలియని విషయాలు కూడా గూగుల్ లో కొడితే తెలిసిపోతున్నాయని సురేష్ వ్యాఖ్యానించడం ఏమిటని ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిమూలపు సురేష్ పై టిడిపి నేత, మాజీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మండిపడ్డారు.
ఆ వ్యాఖ్యలు చేయడం ఏంటి మంత్రి గారు అని గంటా మండిపడ్డారు. గూగుల్ కు కంటెంట్ అందించేది గురువే అన్న సంగతి గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మరోవైపు ఉన్నత విద్యావంతుడు మాజీ సివిల్ సెవెంటైన ఆదిమూలపు సురేష్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గతంలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గూగుల్ కన్నా గురువుల మిన్న అని, టెక్నాలజీ ఎంత వచ్చినా గురువు స్థానాన్ని భర్తీ చేయలేరని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ వ్యాఖ్యలు తెలుగు వాళ్ళు ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఉంటే, ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు తెలుగువారి ఖ్యాతిని దిగజార్చేలా ఉన్నాయని సోషల్ మీడియాలో ఆదిమూలపు సురేష్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఇటువంటి వ్యక్తి గతంలో ఏపీ విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం రాష్ట్ర దౌర్భాగ్యం అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై సురేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సురేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గూగుల్ టెక్నాలజీని వాడుకొని దానిపై ఆధారపడుతూ కొందరు గురువులను మర్చిపోతున్నారన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అంటున్నారు. తనకు గురువులంటే గౌరవం ఉందని, అటువంటి వ్యాఖ్యలు తాను ఎప్పటకీ చేయనని చెప్పారు.