పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. సామాజిక వర్గం తరఫున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధనలో.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మంగళగిరి నియోజకవర్గం నాయకుడు గంజి చిరంజీవి.. తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు.
వన సమారాధన కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేయడంపై పద్మశాలి నాయకుడు, టీడీపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మాటల యుద్దం మహత్తరంగా సాగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి ఊహించని షాక్ తగిలింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన పద్మశాలీల వనభోజనాల్లో పాల్గొన్న గంజి చిరంజీవి అక్కడ రాజకీయ ప్రసంగం ప్రారంభించారు.
నారా లోకేశ్‌పై, పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్థానిక పద్మశాలి నాయకుడు, టీడీపీ నేత శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక వర్గం తరపున నిర్వహిస్తున్న కార్తిక వనసమారాధన కార్యక్రమం రాజకీయాలకు వేదిక కాదని స్పష్టం చేశారు.
ఈరోజు బీసీ నేతలు ఎదిగారంటే ఎన్టీఆర్ పుణ్యమేనని.. పద్మశాలీలకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని శ్రీనివాస్ వివరించారు. పిలవని పేరంటానికి వచ్చి రాజకీయం చేస్తున్నారని చిరంజీవిపై ఆగ్రహం వెలిబుచ్చారు.
దీనిపై చిరంజీవి ఏదో మాట్లాడబోతుండగా.. శ్రీనివాస్ మరింత రెచ్చిపోయి.. “చంద్రబాబు పెట్టిన కూడు తిని.. ఆయనకే ద్రోహం చేస్తున్నావ్“ అని మండిపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్తాయిలో వాదనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కార్తిక వనసమారాధన కార్యక్రమం నిర్వాహకులు ఇద్దరికీ సర్ది చెప్పారు.
దాచేపల్లి లో జరిగిన పద్మశాలి కార్తీక మాస వనసమారాధనకి విచ్చేసిన గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు పేలుతుంటే ధీటుగా ఎదుర్కొని ప్రశ్నించిన దాచేపల్లి బీసీ నాయకుడు ముస్యం శ్రీనివాస్. pic.twitter.com/O5OF3NxRSo
— Purushotham Ineni (@pineni) November 20, 2022