ఏపీలో పేరు మోసిన ఎర్ర చందనం స్మగ్లర్ ఎవరంటే.. ఠక్కున చెప్పే పేరే.. కొల్లం గంగిరెడ్డి. ఈయనపై సుమారు వందల సంఖ్యలోనే చందనం స్మగ్లింగ్, హత్యలు, అక్రమ రవాణా, బెదిరింపులు సహా.. అనే కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కొల్లం గంగిరెడ్డికి వైసీపీ నాయకులతోనూ పరిచయాలు ఉన్నాయని.. రెండేళ్ల కిందట పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో వైసీపీ నాయకులతో ఆయన కలిసి ఉన్న ఫొటోలు కూడా వెలుగు చూశాయి.
అంతేకాదు.. అప్పట్లో చంద్రబాబు కూడా.. గంగిరెడ్డికి.. వైసీపీ నేతల మద్దతు ఉందంటూ.. విమర్శలు చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే గంగిరెడ్డి వ్యవహారం బీజేపీ చుట్టూ తిరుగుతోంది. ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని పెద్దఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేంద్రంలోని పెద్దలతో ఆయన ఇప్పటికే టచ్లోకి వెళ్లారని.. త్వరలోనే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని.. ఆవెంటనే కండువా కప్పేసుకుని కమలం గూటికి చేరిపోతారని కూడా చర్చసాగుతోంది.
ఇలాంటి కీలక సమయంలో బీజేపీ ఏపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ స్పందించారు. “ఔను, నిజమే.. కొల్లం గంగిరెడ్డి మా పార్టీలోకి చేరుతున్నట్టు నాకు కూడా తెలిసింది. అయితే.. దీనిపై ఇంకా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూస్తున్నాం“ అని చిన్నమ్మ చెప్పుకొచ్చారు. దీంతో గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీపై వస్తున్న వార్తలకు బలం చేకూరింది. అయితే.. ఇలా ఒక స్మగ్లర్ ను వందల కొద్దీ కేసులు ఉన్న వ్యక్తిని బీజేపీలోకి ఎలా చేర్చుకుంటారన్న సందేహాలు రావొచ్చు.
కానీ, ప్రస్తుతం ఉన్న బీజేపీ ఎంపీల్లో 52 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో నలుగురు కేంద్ర మంత్రులుగా కూడా ఉన్నారు. ఒకరిపై అయితే.. గతంలో సుప్రీంకోర్టు రాష్ట్ర బహిష్కరణ కూడా విధించింది. సో.. ఇలాంటి వారే ఉన్నప్పుడు.. గంగిరెడ్డి ఒక లెక్కా? అనేది విశ్లేషకుల మాట. ఏదేమైనా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు చిన్నమ్మ వ్యాఖ్యలు నిజమేనని తేల్చి చెప్పడం గమనార్హం.