సాధారణంగా సీఎం అధికారిక నివాసానికి రెండు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ముఖ్యమంత్రి వంటి వీఐపీ నివసించే ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉంటూ అనుమానితులను ఆరా తీస్తుంటారు. ఇక, రాత్రి సమయాల్లో అయితే ఈ పరిధిలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతుంటారు. తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం పరిధిలోనూ ఈ తరహా భద్రతా ఏర్పాట్లుంటాయి.
కానీ, ఇంత భద్రతను కూడా ఛేదించుకొని సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన పెను దుమారం రేపుతోంది. కాబోయే భర్త కాళ్లు, చేతులు కట్టేసి అతడి కళ్లముందే యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపుతోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్లో జరిగిన ఈ రేప్ ఘటన చర్చనీయాంశమైంది. విజయవాడ గాంధీనగర్లోని పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఓ యువకుడు, నర్సుగా పనిచేస్తున్న యువతికి మధ్య ప్రేమ వివాహాన్ని పెద్దలు కుదిర్చారు.
నిన్న రాత్రి కాబోయే భర్తతో కలిసి సీతానగరం పుష్కరఘాట్ వద్ద కూర్చుని ఉండగా…ఇద్దరు దుండగులు వారిపై దాడి చేశారు.
దుండగుల్లో ఒకడు యువకుడి మెడపై బ్లేడు పెట్టి బెదిరించగా… మరొకడు యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రెండో దుండగుడు కూడా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఆ సమయంలో చీకటిగా ఉండడం, రోడ్డుకు చాలా దూరంలో ఈ ప్రాంతం ఉండడంతో బాధితుల కేకలు ఎవరికీ వినపడలేదు. ఆ తర్వాత ఆ యువతి, యువకడి సెల్ఫోన్లను, నగదును, యువతి చెవి దిద్దులను తీసుకుని పడవలో నది మీదుగా దుండగులు పరారయ్యారు.
అక్కడ నుంచి బయటపడ్డ జంట… పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ మొదలుపెట్టారు. ఇది, బ్లేడ్ బ్యాచ్ పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను గుర్తించిన పోలీసులు బాధిత యువకుడితో ఐడెంటిఫికేషన్ సెషన్ నిర్వహించారు. ఇంకా, నిందితులు పరారీలోనే ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.